టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ నేతగా కాదు మనిషిగా కూడా దిగజారిపోయారని అలాంటి నేత ఏపీలో పుట్టినందుకు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారే తత్వం బాబుది అన్నారు. తనకంటే వయసులో చిన్నవారు అయినా అమిత్ షా ముందు మోకరిల్లడానికి కూడా బాబు సిద్ధపడ్డారు అంటే ఆయన అధికార యావ ఎంతో అర్ధం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ తో ఒకసారి, బీజేపీతో మరోసారి ఇలా దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏకైన రాజకీయ నేత చంద్రబాబే అని ఆమె అన్నారు.
ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా రంగులు మార్చే ఘనుడు చంద్రబాబు అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏపీకి చేసింది ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కనీసం ఒక్క సంక్షేమ పధకం అయినా అమలు చేసిన చరిత్ర ఉందా అని నిలదీశారు.
చంద్రబాబు మీటింగులలో ఎంతసేపూ జగన్ ని తిట్టడం తప్ప తాను పరిపాలించిన సందర్భంలో రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో ఎందుకు చెప్పలేకపోతున్నారు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని అయినా చెబుతారు అన్నీ హామీలు ఇస్తారు, తీరా అధికారం దక్కాక మాత్రం వాటిని మరచిపోతారని ఎద్దేవా చేశారు.
ఈ రోజున తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు కళ్ల ముందు ఉందని, అందుకే తాను చంద్రబాబునే తమ పాలన గురించి ప్రజల మధ్యన తేల్చుకుందామని సవాల్ చేస్తున్నాను అన్నారు. ఏసీ రూములలో కూర్చుని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడతారు తప్ప తమలా గడప గడపకూ వెళ్ళే దమ్ము ఎవరికి ఉందని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబుని ఆయన పార్టీని ఎవరెన్ని జాకీలు ఎత్తి లేపాలని చూసినా ఆ జాకీలు విరిగిపోతాయి తప్ప ఆ పార్టీ లేచేది లేదు బాబు గెలిచేది లేదని రోజా సెటైర్లు పేల్చారు. చంద్రబాబు అన్ని తోక పార్టీలను వెంటేసుకున్నా గెలుపు ధీమా లేక అలా ఉన్నారని ఆమె అన్నారు. తాము ప్రజల పక్షం అని అందుకే ప్రజలే తమ పార్టీని గెలిపిస్తారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.