పచ్చమీడియా టీడీపీ అభ్యర్థుల జాబితా అంటూ ఒక లీక్ ఇవ్వడం, ఆ అభ్యర్థుల జాబితాపై తెలుగుదేశం నేతలు బాధపడటం లేదా దానిపై మళ్లీ మరొకరు రియాక్షన్ లు ఇవ్వడం.. ఇదీ ఇప్పుడు టీడీపీ వైపున జరుగుతున్న కామెడీ!
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎంతకూ చేయకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో నిస్పృహ ఆవరిస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల తెలుగుదేశం అనుకూల మీడియా అభ్యర్థుల జాబితా అంటూ అచ్చేసింది. అనధికారికం అంటూ .. అధికారిక మీడియా ప్రకటనలు చేస్తోంది! మరి ఈ ప్రకటనలను చూసి తెలుగుదేశం నేతలు తెగ ఇదైపోతున్నారు!
ఈ మధ్యనే అనంతపురం ఎంపీగా కాలువ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీగా పార్థసారధిని ప్రకటించింది పచ్చమీడియా! వారిద్దరూ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎంపీగా పోటీ చేసేది లేదంటూ వారు గడబిడ అయ్యారు! పచ్చమీడియా చెప్పిందంటే అది చంద్రబాబు చెప్పడమే అనే విషయాన్ని ఎరిగిన వారు .. తమకు ఎంపీ టికెట్లు వద్దంటూ తేల్చేశారు! మరి చెప్పేది పచ్చమీడియాధిపతులకో, లేక చంద్రబాబుకో కానీ ఇప్పుడు ఆ ప్రకటనలను విని.. జేసీ ప్రభాకర్ రెడ్డి మురిసిపోతున్నారు!
చాన్నాళ్ల కిందటే జేసీ పవన్ ను అనంతపురం లోక్ సభ నియోజకవర్గం ఇన్ చార్జి హోదా నుంచి తప్పించారు. అక్కడ కాలువను ఇన్ చార్జిగా ప్రకటించారు, పచ్చమీడియా ఇప్పుడు ఆయననే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాలువ ఆసక్తిలేదంటుండటంతో.. ప్రభాకర్ రెడ్డి తమకు అవకాశం ఇవ్వాలంటూ మొదలుపెట్టారు!
అనంతపురం ఎంపీ టికెట్ ను తమ కుటుంబానికి ఇవ్వాలంటున్నారాయన, పోటీకి అవకాశం ఉన్న వాళ్లు ఆసక్తి చూపడం లేదు కాబట్టి.. ఛాన్స్ తమకు ఇస్తే పోటీకి సై అంటున్నారు! ఒక కుటుంబానికి ఒకే సీటు అని చంద్రబాబు తమకేమీ చెప్పలేదని కూడా ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు! మరి ఇంతకీ అనంతపురం ఎంపీ టికెట్ ను ప్రభాకర్ రెడ్డి కోరుతున్నది తన తనయుడు అస్మిత్ రెడ్డికో, లేక అన్న కొడుకు పవన్ రెడ్డికో!