ఏపీ రాజకీయం పరిస్థితులపై మరో సర్వే తన అంచనాలను వెలువరించింది. టైమ్స్ నౌ ప్రసారం చేసిన మ్యాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్స్ సర్వే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే అంచనాలను వెలువరించింది. దాని ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 ఎంపీ సీట్లు, తెలుగుదేశం-జనసేన కూటమికి ఆరు ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ప్రకటించింది.
మొత్తం 25 ఎంపీ సీట్లున్న ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం తిరుగులేని రీతిలో కొనసాగుతుందని ఈ సర్వే అంచనా వేసింది. 25 సీట్లలో 19 ఘన విజయం అనే చెప్పాలి. ఒక తమ పొత్తులతో తమకు తిరుగులేదనుకుంటున్న టీడీపీ- జనసేనలు కేవలం ఆరు సీట్లకే పరిమితం అవుతాయని ఈ సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్, బీజేపీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ సర్వే అంచనా వేసింది. ఇక ఓట్ల శాతం వారీగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47 శాతం పైగా ఓట్లు దక్కే అవకాశం ఉందని ఈ అధ్యయనం ప్రకటించింది. టీడీపీ- జనసేన కూటమిగా 44 శాతం ఓట్లను దక్కించుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
బీజేపీ రెండు శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లను ఏపీలో పొందవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ఇతరులు నాలుగు శాతం వరకూ ఓట్లను పొందుతారని పేర్కొంది.
గత ఎన్నికల్లో 51 శాతం ఓట్లను పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతం ఓట్లను కోల్పోయినా సీట్ల లెక్కల్లో మాత్రం ఘనవిజయాన్నే అందుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. లోక్ సభ సీట్ల లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సర్వే ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 140 అసెంబ్లీ సీట్ల వరకూ దక్కే అవకాశం ఉంది!