పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. కానీ ఎన్నికల తరువాత మళ్లీ పవర్ స్టార్ అవతారమే వుంచుకుంటారనే అభిప్రాయం కలుగుతోంది.
జనసేన అధిపతి అనేది పార్ట్ టైమ్ నా లేదా సినిమాలు పార్ట్ టైమ్ నా, లేక రెండూనా అన్నది ఓ ధర్మ సందేహం. ఎందుకంటే ఆయన ఇంకా ఇరవై రోజులు వర్క్ చేయాల్సి వున్న ఓజి సినిమా విడుదల డేట్ ను ప్రకటించారు. అంటే ఎన్నికల తరువాత మళ్లీ సినిమాల్లోకి వస్తారన్న మాట.
ఈ మధ్యనే నిర్మాత దానయ్య వెళ్లి పవన్ ను కలిసినపుడు, ఎన్నికల అనంతరం వచ్చి సినిమా పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓజి కాక, పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయి. ఆ రెండూ కాక మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వున్నాయి.
అంటే సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారన్న మాట. మరి ఎన్నికల అనంతరం తేదేపాతో కలిసి జనసేన భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్నది ఆ రెండు పార్టీ వర్గాల భావన. అలాంటపుడు పవన్ మంత్రిగా వుంటారా? వుండరా? మంత్రిగా వుంటే సినిమాలు చేయడానికి అవకాశం తక్కువ వుంటుంది. ఎందుకంటే టైమ్ సరిపోదు.
మరి పవన్ సినిమా షూటింగ్కు వస్తాను అని చెబుతున్నారు అంటే మంత్రిగా వుండడం ఇష్టం లేనట్లా? లేక తమ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం లేనట్లా? లేదూ… తాత్కాలికంగా నిర్మాతలు బాధపడకుండా వుండడం కోసం ఏదో ఒకటి నమ్మబలుకుతున్నట్లా?
రెండు నెలలు ఆగితే కానీ క్లారిటీ రాదు.