రాజకీయాల్లో కామెడీ చేసే వారు ఉన్నట్టే.. కామెడీ చేసే అలవాటు నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో బాబూమోహన్ కూడా ఒకరు. ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న ఆయన గతంలో మంత్రిగా కూడా చేశారు. ప్రస్తుతానికి భాజపాలో ఉన్న ఆయన పార్టీ మీద అలిగి తాజాగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా కొత్త సంగతి గానీ, ఆశ్చర్యకరమైన సంగతి గానీ కాదు. కానీ.. తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం గురించి చెబుతున్న మాటలే కొత్త కామెడీగా ఉన్నాయి.
గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నానని, పార్టీలోని గ్రూపులతో తన మీద విమర్శలు చేయిస్తున్నారని, తనకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని బాబూ మోహన్ భాజపా మీద ఆరోపణలు చేశారు. బాబూమోహన్ వలన ఎవరి మనుగడకు థ్రెట్ ఉంటుందనే భయంతో ఎవరు కుట్రలు చేస్తారో తెలియదు గానీ.. ఆయన మాత్రం ఏదో జరిగిపోతోందని అనుకున్నట్టుగా ఉంది.
బాబూ మోహన్ వరంగల్ ఎంపీ సీటు నుంచి భాజపా తరఫున పోటీ చేయాలని అనుకున్నారట. అయితే పార్టీలో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదుట. అందుకే రాజీనామా చేస్తున్నా అన్నారు. అసలు టికెట్ ఇస్తే ఉండడం, ఇవ్వకపోతే వెళ్లిపోతా అనడం.. ఇదెక్కడి రాజకీయమో అర్థం కావడం లేదు. బిజెపి వంటి పార్టీలో ఇలాంటి వైఖరి నడుస్తుందని బాబూ మోహన్ ఎలా అనుకున్నారో తెలియదు.
అయితే గతంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇలాంటి అలకాస్త్రాన్ని ప్రయోగించి లాభపడిన సంగతి ఆయనకు సెంటిమెంటుగా గుర్తొచ్చి మళ్లీ అదే పనిచేశారేమో అనేది ప్రస్తుతం అందరూ అనుకుంటున్నారు.
గతంలో ఆందోల్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా పోటీగా కొడుకును భాజపా ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తూ ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా.. పార్టీని విడిచిపెడుతున్నట్టు బాబూమోహన్ ప్రకటించారు. తర్వాత రెండు రోజుల్లో టికెట్ ఆయనను వరించింది. కొడుకు వెళ్లి బీఆర్ఎస్ లో చేరాడు. అంతగా అలకపూని మరీ టికెట్ సాధించుకున్న ఈ కమెడియన్ నేత.. ఎన్నికల్లో కేవలం అయిదువేల ఓట్లు మాత్రమే సాధించారు. డిపాజిట్ కూడా దక్కలేదు. గతంలో గెలిచిన సీటులోనే డిపాజిట్ కూడా దక్కకపోతే.. ఎక్కడో వరంగల్ కు వెళ్లి అక్కడ ఎంపీ అవుదామని ఆయన ఎలా అనుకున్నారో తెలియదు.
ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత.. వేరే పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ చేయలేదు అంటున్నారు గానీ.. ఎప్పటికైనా సరే వరంగల్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ కమెడియన్ నాయకుడికి అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందో మరి.