ఎన్నికల నోటిఫికేషన్ సుదూరంగా వుండగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. సమయం దగ్గర పడే కొద్ది సరైన అభ్యర్ది కోసం అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ స్థానాల్లో గెలుపు గుర్రాలను సిద్దం చేస్తున్నారు. జగన్ ఏ విధమైన కసరత్తులు చేసి అభ్యర్ధులను నిర్ణయిస్తున్నాలరన్నది ఆయనకే తెలియాలి.
కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం ఎంపీ అభ్యర్ధుల ఎంపికకు గతంలో ఎన్టీఆర్ అనుసరించిన వ్యూహాన్ని అనుసరించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పార్లమెంట్ కు పోటీ చేయాలంటే ఆర్ధిక బలం అవసరం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు అలాంటి వారిన చూసి, ఎంచి రంగంలోకి దింపారు. గతంలో చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ లాంటి వారిని అలాగే రంగంలోకి దింపారు.
ఇప్పటికే పలు యువ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు టచ్ లో వున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ఏలూరు లేదా రాజమండ్రి ఎంపీ టికెట్ ను కంచర్ల సుధాకర్ కు ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏలూరు టికెట్ ను వైకాపా బిసి లకు కేటాయించింది. కానీ ఈ నియోజకవర్గం మీద అన్ని వర్గాల పట్టు వుంది. అందుకే తేదేపా మాత్రం వైకాపా సూత్రాన్ని అనుసరించకుండా, ఆర్ధికబలం పుష్కలంగా వున్న అభ్యర్ధి కోసం వేట సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల బోగట్టా. అయితే కంచర్లకు ఏలూరు ఇస్తారా లేక మరో పార్లమెంట్ స్ధానం కేటాయిస్తారా అన్నది కూడా డిస్కషన్ లో వినిపిస్తోంది.
అక్కడే ఈ కంచర్ల సుధాకర్ రంగంలోకి దిగారో, లేదా ఆయన మీద పార్టీ ఫోకస్ పడిందో మొత్తానికి కంచర్ల సుధాకర్ పేరు బయటకు వచ్చింది. యువకుడు విద్యావంతుడు అయిన ఇతగాడు పలు ఐటి సంస్థలకు యజమాని. అలాగే హెల్త్ కేర్ రంగంలో మంచి విజయాలు నమోదు చేసారు. టీడీపీ యువనేత లోకేశ్ ఆయనకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆయనని నర్సారావు పేట, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి ఎంపీ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయంపై కంచర్ల సుధాకర్‌కి స్పష్టత ఇచ్చారని, పార్లమెంట్ అభ్యర్దిగా బరిలో దిగేందుకు ఆయన కూడ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.