ఎన్నికల ముందు జనసేనకు షాక్. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. ఫ్రీ సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతుండగానే, మరోవైపు జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ ఆ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
జనసేన పార్టీని పదేళ్ల క్రితం అట్టహాసంగా పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. అయితే పార్టీని స్థాపించిన 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా వుండింది. టీడీపీ, బీజేపీ కూటమి పల్లకీని పవన్ మోశారు. ఆ తర్వాత కాలంలో టీడీపీ, బీజేపీలతో పవన్‌కు విభేదాలు వచ్చాయి. దీంతో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పవన్ తలపడ్డారు. జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక్క స్థానం దక్కింది.
చివరికి పవన్ నిలిచిన రెండు చోట్లా ఓడిపోయారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓట్లు రాకపోవడంతో గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా గత ఏడాది మే 13న ఈసీ ప్రకటించింది. దీంతో ఆ గుర్తు తమకు కేటాయించాలని ఈసీతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చర్చలు సాగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల జనసేనకు గాజు గ్లాస్ కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. గాజు గ్లాస్‌ను జనసేనకు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ తమను తప్పుదోవ పట్టించి, జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, అలాగే జనసేన పార్టీని పిటిషనర్ చేర్చారు.