పొత్తులో బీజేపీకే సీటు అంటున్న మాజీ మంత్రి

టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో బీజేపీ పొత్తు ఇంకా తేల‌నే లేదు. అప్పుడే సీట్లపై పంచాయితీ మొద‌లైంది. పొత్తులో భాగంగా ప్రొద్దుటూరు సీటు త‌న‌దే అని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అప్పుడే దండోరా కొట్ట‌డం మొద‌లెట్టారు. సీఎం…

టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో బీజేపీ పొత్తు ఇంకా తేల‌నే లేదు. అప్పుడే సీట్లపై పంచాయితీ మొద‌లైంది. పొత్తులో భాగంగా ప్రొద్దుటూరు సీటు త‌న‌దే అని మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి అప్పుడే దండోరా కొట్ట‌డం మొద‌లెట్టారు. సీఎం జ‌గ‌న్‌పై విప‌రీత‌మైన ద్వేషాన్ని నింపుకున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి మ‌రీ ఇదిగో పొత్తు, అదిగో పొత్తు అని ఆయ‌న నెత్తీనోరూ కొట్టుకుని మ‌రీ చెబుతున్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే భ‌యంతో బీజేపీలో ఆదినారాయ‌ణ‌రెడ్డి చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే అధికారాన్ని రుచి మ‌రిగిన ఆదినారాయ‌ణ‌రెడ్డికి ప‌ద‌వి లేక‌పోతే నిద్ర ప‌ట్ట‌ని ప‌రిస్థితి. టీడీపీతో పొత్తు వుంటే ఎలాగైనా సీటు ద‌క్కించుకోవచ్చనేది ఆయ‌న ఆలోచన‌. గ‌తంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఆదినారాయ‌ణ‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి చంద్ర‌బాబు కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి ఒక‌రు.

గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా టీడీపీ త‌ర‌పున బ‌రిలో దిగి అవినాష్ చేతిలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న బీజేపీ నాయ‌కుడి అవ‌తారం ఎత్తారు. టీడీపీ గ‌ళాన్ని వినిపిస్తున్నారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఆది అన్న కుమారుడు భూపేష్ టీడీపీ త‌ర‌పు నుంచి పోటీ చేయ‌నున్నారు. దీంతో ఆదినారాయ‌ణ‌రెడ్డికి కూడా ఒక నియోజ‌క‌వ‌ర్గం కావాలి.

పొత్తులో భాగంగా ప్రొద్దుటూరు నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇప్ప‌టికే ప్రొద్దుటూరు టీడీపీలో నాలుగైదు గ్రూప్‌లున్నాయి. ఒక నాయ‌కుడికి టికెట్ ఇస్తే, మ‌రొక‌రు బ‌య‌టికి పోయే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి ప్రొద్దుటూరులో ప్ర‌వేశిస్తే ప‌రిస్థితి ఎలా వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప్రొద్దుటూరుకు ఆది స్థానికేత‌రుడు. ఆదికి లోక‌ల్ లీడ‌ర్లు స‌హ‌క‌రించే ప‌రిస్థితి వుండ‌దు. ముందు బీజేపీతో పొత్తు తేలితే, ఆ త‌ర్వాత చూద్దాం అనే రీతిలో టీడీపీ నాయ‌కులున్నారు.