జనసేనాని పవన్‌కల్యాణ్ బెదిరింపులకు చంద్రబాబునాయుడు భయపడడం లేదు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడీనెల్లూరు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించి జనసేనాని పవన్‌కల్యాణ్‌కు షాక్ ఇచ్చారు. అయినప్పటికీ చేసేదేమీ లేక పవన్‌కల్యాణ్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రా…కదిలిరా బహిరంగ సభను జీడీనెల్లూరులో నిర్వహించారు.
ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ తనదైన చతురతతో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇటీవల చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది పవన్‌కు నచ్చలేదు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదని, తనపై కూడా తీవ్ర ఒత్తిడి వుందంటూ రాజోలు, రాజానగరంలలో తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ మధ్య భేటీ జరిగింది.
ఇలా ఎవరికి వారు అభ్యర్థుల ప్రకటనకు ఫుల్స్టాప్ పడుతుందని భావించారు. అబ్బే… చంద్రబాబు తగ్గేదేలే అనే రీతిలో ఎప్పట్లాగే వ్యవహరించారు. జీడీనెల్లూరు బహిరంగ సభలో చంద్రబాబు వ్యూహాత్మకంగా తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జనసేనకు కోపం తెప్పించింది. బాబు తన అభ్యర్థిని ఎలా ప్రకటించారంటే…
“ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం థామస్. విద్యావంతుడైన థామస్‌ను టీడీపీలోకి రావాలని అడిగా. జీడీనెల్లూరు ఇన్చార్జ్గా నియమిస్తానని చెప్పా. జీడీనెల్లూరుకు వచ్చినప్పటి నుంచి థామస్ బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం, జనసేన పొత్తులో ఉండడం వల్ల పేరు చెప్పడం లేదు. కానీ ఈ నియోజకవర్గ ఇన్చార్జ్గా బ్రహ్మాండగా పని చేస్తున్న థామస్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా” అని చంద్రబాబు అన్నారు.
జీడీనెల్లూరు జనసేన ఇన్చార్జ్ డాక్టర్ పొన్నా యుగంధర్ చాలా కాలంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారు. టికెట్‌పై ఆయన ఆశ పెంచుకున్నారు. తాజాగా జనసేనను కనీసం పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన గుర్రుగా వుంది. అలాగని చంద్రబాబును నిలదీయలేని పరిస్థితి. బాబు వైఖరితో ఖంగుతిన్న జీడీనెల్లూరు జనసేన నాయకులు, కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరిస్తున్నారు.