జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొస్తుందని ఇరుపార్టీల నాయకులు అనుకున్నారు. అయితే సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు సమయానికి వచ్చే సరికి మళ్లీ కొత్త చర్చ మొదలైంది. జనసేనకు మరీ తక్కువ సీట్లు ఇస్తున్నారనే ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వుంది. జనసేనకు మద్దతుగా నిలుస్తుందన్న సామాజిక వర్గం ఓట్ల బదిలీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే మాత్రం పొత్తు వల్ల ఇరుపార్టీలకు ప్రయోజనం వుండకపోవచ్చనేది మెజార్టీ అభిప్రాయం.
సీట్లు, నియోజక వర్గాల కేటాయింపు విషయంలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఈ సమయంలో మూడో పార్టీ పొత్తులో ప్రవేశించడం గమనార్హం. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళుతున్నారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటే మాత్రం టీడీపీకి ఆత్మహత్యా సదృశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం అంటే బాబుకు రాజకీయంగా పోయే కాలం దగ్గర పడ్డట్టే అనే చర్చకు తెరలేచింది.
బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వల్ల ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, దళితులు, గిరిజనులు ఆ పార్టీలకు దూరమవుతారు. అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ద్రోహం చేసిందన్న ఆగ్రహం ఏపీ ప్రజానీకంలో బలంగా వుంది. ఈ ఆగ్రహం రానున్న ఎన్నికల్లో బీజేపీతో అంటకాగిన పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనుందని పౌర సమాజం అంటోంది.
బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కుదుర్చుకోవాలని వైసీపీ కోరుకుంటోంది. అధికార పార్టీ ఏదైతే ఆశిస్తున్నదో, అదే పని చంద్రబాబు చేయడానికి సిద్ధమయ్యారు. కేవలం వైసీపీని ఎన్నికల్లో ఎదుర్కోలేమన్న భయమే బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. నిజానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం ఏ ఒక్క టీడీపీ కార్యకర్తకు ఇష్టం లేదు.
అయితే ఈ ఎన్నికలు టీడీపీకి చావు బతుకు సమస్య కావడంతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బీజేపీ శరణు కోరడానికి చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కుదుర్చుకోవడంతో వైసీపీకి కొన్ని వ్యవస్థల నుంచి సహకారం ఉండదని చంద్రబాబు నమ్ముతున్నారు. అయితే ఆశ చెడ్డదంటారు. 2014లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సమయంలోనే జగన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం నడుచుకోవడం చంద్రబాబుకు తెలియదని అనుకోలేం.
అయితే ఎన్నికల అనంతరం తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనే చంద్రబాబు రాజకీయంగా నష్టపోవడానికి సైతం సిద్ధపడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి, అధికారంలోకి రాకపోతే టీడీపీకి భవిష్యత్ వుంటుందని చంద్రబాబు ఎందుకు ఎలా నమ్ముతున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు. రాజకీయాల్లో ప్రజాబలం ఉన్న పార్టీలకే విలువ వుంటుంది.
బీజేపీతో పొత్తు కుదురితే మాత్రం వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకంటే.. టీడీపీ పోటీ చేసే స్థానాలు మరింతగా కుదించుకుపోతాయి. మరో పార్టీ నాయకత్వాన్ని బలపరచడానికి నేతలు సిద్ధంగా ఉండరు. అరశాతం ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్న చంద్రబాబునాయుడి భయాన్ని అర్థం చేసుకుని జాలి చూపడం మినహా చేయగలిగిందేమీ లేదు.