హిందూ మత వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఏ హిందూ దేవాలయం అమలు చేయని సాహసోపేత నిర్ణయం తీసుకుంది. హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మార్పిడులకు అడ్డుకట్ట వేస్తూనే, ఇతర మతాల నుంచి హిందూ మతమార్పిడి ప్రోత్సహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి తిరుమలను వేదిక చేయడానికి తీర్మానం చేసింది.
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేదీ వరకు తిరుమల ఆస్థానమండపంలో శ్రీవేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు సుమారు 60 మంది ప్రత్యక్షంగా, దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కట్టుబడిన తీరును వారు ముక్త కంఠంతో ప్రశంసించారు.
కరుణాకరరెడ్డి 2006-2008 మధ్య తొలిసారి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఇలాగే ధార్మిక సదస్సు జరిపి ఎంతో మంది పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించిన విషయం వారు గుర్తు చేసి అభినందించారు. ఆ సదస్సులో తాము చేసిన సూచనలు, సలహాలను అమలు చేయడానికి దళిత గోవిందం, మత్స్య గోవిందం, కల్యాణ మస్తు లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి హిందూ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడానికి ఉద్యమం నడిపారని వారు గుర్తు చేశారు.
శ్రీవేంకటేశ్వర స్వామి వారికి సంగీత సేవ చేసిన శ్రీతాళ్ళపాక అన్నమయ్య, శ్రీ తరిగొండ వెంగమాంబ, దాస సాహిత్య, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుల ద్వారా వారి రచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారని అభినందించారు. కరుణాకరరెడ్డి హిందుత్వ భావాన్ని, ఆస్తికత్వాన్ని ఎవరూ ప్రశ్నించే స్థాయిలో లేదని, ఒక వేళ ఎవరైనా ఆరోపణలు, విమర్శలు చేసినా వాటిని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోవాల్సిన పనే లేదని మఠాధిపతులు, పీఠాధిపతులు గట్టిగా సూచించారు.
మంగళ సూత్రాల ఆలోచనకు అభినందనలు
హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మార్పిడులకు అడ్డుకట్ట వేసే ఆలోచనతో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మహిళలకు మంగళ సూత్రాలు అందించే నిర్ణయం నిర్ణయం ఎంతో మంచిదని పీఠాధి, మఠాధిపతులు సంతోషం వ్యక్తం చేశారు.
స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారంతో 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో వివిధ సంప్రదాయాలకు అనుగుణంగా నాలుగైదు డిజైన్లలో మంగళ సూత్రాలు తయారు చేయించి వాటిని స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి మహిళలకు లాభ నష్టాలు లేని ధరకు విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సదస్సులో కరుణాకర రెడ్డి తెలియజేశారు. స్వామి వారి అనుగ్రహంతో తయారైన మంగళ సూత్రాలు హిందూ మతానికి చెందిన మహిళల మెడలో నిరంతరం ఉండటం వల్ల స్వామివారి అనుగ్రహం తమకు ఎల్లవేళలా ఉంటుందనే భావన కలుగుతుందని, దీనివల్ల మతాంతీకరణ ఆలోచనలు కూడా వారికి రావనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
వెంకన్న ఆలయం వేదికగా హిందూ మతంలోకి
ఇతర మతాలకు చెందిన వారు హిందూ మతాన్ని నమ్మి స్వచ్ఛందంగా హిందూ మతం స్వీకరించాలనుకుంటే అలాంటి వారికి తిరుమల వేదికగా స్వాగతం పలకాలని టీటీడీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. సదస్సులో చేసిన సలహాలు సూచనలు అమలు చేయాలని కరుణాకర రెడ్డి వెనువెంటనే నిర్ణయం తీసుకోవడం పట్ల స్వామీజీ లు సంతోషం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసిన జలాలను హిందూ మతంలోకి మారాలనుకునే వారికి సంప్రోక్షణం చేసి శాస్త్రోక్తంగా హిందూ మతాన్ని ఇస్తారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి పంపుతారు. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కరుణాకరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 20 వ తేదీ నిర్వహించనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనున్నారు.