హీరో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన వెంటనే తలెత్తిన తొలి ప్రశ్న ఇది. నిజానికి విజయ్ కంటే ముందే పొలిటికల్ గా కాస్త చురుగ్గా వ్యవహరించిన వ్యక్తి విశాల్. గత ఎన్నికల్లో కూడా విశాల్, రాజకీయంగా కాస్త హడావుడి చేసే ప్రయత్నం చేశాడు. ఈసారి తన అభిమాన హీరో విజయ్ పార్టీ పెట్టడంతో, విశాల్ కూడా రంగంలోకి దిగుతాడనే ప్రచారం జరిగింది.
తన పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, విశాల్ స్పందించాడు. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు, రాజకీయ లబ్ది ఆశించి ప్రజలకు సేవ చేయడం లేదని తెలిపాడు.
“ప్రజల అభ్యున్నతి కోసం ప్రజాసంక్షేమ ఉద్యమాన్ని రూపొందించి జిల్లాల వారీగా, బ్లాక్‌ల వారీగా, శాఖల వారీగా పనిచేయడం, మా అమ్మ పేరిట నిర్వహిస్తున్న 'దేవి ఫౌండేషన్' ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం చేయడం నా తదుపరి దశ. దివంగత మాజీ రాష్ట్రపతి సర్ అబ్దుల్ కలాం పేరు మీద ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థులకు విద్యనందించేందుకు కృషి చేస్తున్నాను. నేనెప్పుడూ రాజకీయ లబ్ది ఆశించి ఈ పనులు చేయలేదు. మానసికంగా అది నా కర్తవ్యంగా భావిస్తున్నాను.”
ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం చేస్తున్న ప్రజాసేవను కొనసాగిస్తానని… రానున్న కాలంలో దైవం/కాలం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజల్లో ఒకడిగా ప్రజల కోసం మాట్లాడేందుకు వెనుకాడనని ప్రకటించాడు విశాల్.
2017లో ఆర్కే నగర్ బై-ఎలక్షన్ లో విశాల్ నామినేషన్ వేశాడు. అలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. కానీ ఊహించని విధంగా అతడి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నిబంధనల ప్రకారం తగిన సంఖ్యలో ప్రపోజర్స్ లేకపోవడం వల్ల అతడు ఆ ఎన్నికల్లో నిలబడలేకపోయాడు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.