ఉత్తరాంధ్ర జనాలు మంచి వాళ్లు. ఎక్కడ నుంచి ఎవరు వచ్చి, తమ సీట్లు లాక్కుని తమ మీద పెత్తనం చేసినా సహిస్తూనే వుంటారు. ఎన్టీఆర్ టైమ్‌లోనే ఇచ్ఛాపురం, చీపురుపల్లి సీట్లు నాన్ లోకల్స్‌కు ఇచ్చినా భరించారు.
విశాఖ సిటీ రాజకీయం మొత్తాన్ని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా జనాలు అయినా సరే అన్నారు. మీకు రాజధాని అక్కర లేదు మాకే రాజధాని కావలి అని అమరావతి వాసులు అన్నా ఒకె అలాగే వున్నారు. కళాబంధు, పురంధీశ్వరి, నేదురుమల్లి ఇలా నాన్ లోకల్స్ అంతా వచ్చినా గెలిపించి పంపించారు. దాంతో ప్రతి వాళ్లకూ ఉత్తరాంధ్ర అంటే లోకువైపోయింది. ఫ్రీ సరుకులా కనిపిస్తోంది. నాకు.. నాకు అంటూ ఎగబడుతున్నారు.
అనకాపల్లి సీటు కావాలి అని బుద్దా వెంకన్న అడుగుతారు. పరుచూరి భాస్కరరావు అడుగుతారు. నాగబాబు అడుగుతారు. గతంలో అల్లు అరవింద్ వచ్చారు. ఓడించి పంపారు. నూకారపు సూర్య ప్రకాశరావు వచ్చారు ఓడించి పంపారు. ఇప్పుడు కూడా ఇలా వచ్చే బుద్దా వెంకన్న కావచ్చు, నాగబాబు కావచ్చు, నాన్ లోకల్స్ ఎవరినైనా అనకాపల్లి జనాలు చేయాల్సింది ఒక్కటే ఓడించి పంపడం.
ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గంటాను ఆదరించారని చెప్పి ఆయన బంధువు పరుచూరి భాస్కరరావు వచ్చారు. ఇలా అనకాపల్లి మరీ ఫ్రీ సరుకులా మారింది. అందరూ మాకు కావాలంటే మాకు కావాలని ఎగబడుతున్నారు.
ఇదే అనకాపల్లి జనాలు, ఉత్తరాంధ్ర వాసులు వెళ్లి కృష్ణ, గుంటూరుల్లో పోటీ చేసే అవకాశం తెచ్చుకోగలరా? గెలవడం సంగతి సరే, కనీసం ముందు టికెట్ తెచ్చుకోగలరా? ఉత్తరాంధ్ర జనాలు ఎప్పుడు రాయలసీమ వాసుల్లా పౌరుషం తెచ్చుకుంటారో మరి?