ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ శర వేగంగా మారుతున్నాయి. జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడం వల్ల సీఎం జగన్ను ఎదుర్కోలేమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అండ వుంటే తప్ప ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీజేపీ పొత్తు కోసం ఆయన వెంపర్లాడుతున్నారు.
ఇదిలా వుండగా బీజేపీతో పొత్తును టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు వల్ల ఓట్లు పోవడమే తప్ప, వచ్చే ది వుండదని బాబుకు సొంత పార్టీ నేతలు తెగేసి చెప్పారు. బీజేపీతో పొత్తు కోరుకోడానికి దారి తీసిన పరిస్థితుల్ని బాబు వివరించినట్టు తెలిసింది.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా నష్టం… పెట్టుకోకపోతే వ్యక్తిగతంగా కష్టమని తన పార్టీ ముఖ్య నేతల వద్ద బాబు నిస్సహాయతను వ్యక్తపరిచినట్టు తెలిసింది. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చినా, ఏదో ఒక కారణంతో పాలన సవ్యంగా సాగించరనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే కష్టమైనా, నష్టమైనా బీజేపీతో కలిసి వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపారని సమాచారం.
బీజేపీతో పొత్తు వుంటుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు వద్దని, సొంత పార్టీ శ్రేణులు కూడా ఆ పార్టీకి ఓట్లు వేయవనే చర్చ తెరపైకి వచ్చింది. చంద్రబాబు భయమే ఆయనకు ప్రధాన శత్రువైందని, ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.