జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరు కాపులెవరికీ నచ్చడం లేదు. 20 లేదా 25 అసెంబ్లీ సీట్ల కోసం టీడీపీకి తమను బానిసలు చేస్తున్నారనే ఆవేదన పవన్‌ను అభిమానించే కాపుల్లో వుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కాపు కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా లేఖలోని అంశాలు కాపుల్ని ఆలోచింప చేస్తున్నాయి.
జగన్‌ను గద్దె దించడం అంటే, చంద్రబాబునాయుడిని సీఎం చేసేందుకు కాదని చేగొండి హితవు పవన్‌కు గట్టి దెబ్బే. మరోవైపు చేగొండి లేఖపై మీడియాలో విస్తృతమైన చర్చకు దారి తీసింది. టీవీ డిబేట్లలో చేగొండి లేఖపై మీడియా ప్రతినిధులు, ప్రత్యర్థుల నిలదీతలకు జనసేన నేతలు ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చేగొండికి మద్దతు పెరుగుతోంది.
చేగొండి చెబుతున్నట్టు 40 నుంచి 60 సీట్లు, అలాగే రెండున్నరేళ్ల పాటు అధికారంలో భాగస్వామ్యం లేకపోతే టీడీపీతో పొత్తు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చేగొండి మొదటి నుంచి చెబుతున్నట్టు ఆ మాత్రం సీట్లు, అధికారాన్ని దక్కించుకోడానికి ఒప్పందం కుదుర్చుకోకపోతే, కాపుల ఆత్మాభిమానం దెబ్బతినదా? అనే ప్రశ్న ఆలోచింపజేస్తోంది.
మరోవైపు చేగొండి నిలదీతలు జనసేన నేతలకు ఇబ్బందికరంగా మారాయి. ఇలాగైతే పొత్తు చిత్తు అవుతుందని ఆందోళన వారిలో కనిపిస్తోంది. చేగొండి చెప్పినట్టు టీడీపీ మెడలు వంచి అనుకున్నది సాధించకపోతే కాపుల ఓట్లు టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ కావనే అభిప్రాయం బలపడుతోంది. అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని, చేగొండి చెప్పినట్టు మొదట్లోనే టీడీపీతో అవగాహనకు రావడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాదు, కూడదంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు చావు దెబ్బ తినక తప్పదనే హెచ్చరిక వెల్లువెత్తుతోంది.