ఫైటర్ సినిమాకు చాలా తలనొప్పులు ఎదురవుతున్నాయి. నెగెటివ్ టాక్ పక్కనపెడితే.. మిడిల్ ఈస్ట్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో ఓ సన్నివేశంపై కేసు పడింది. ఇప్పుడీ కేసుతో త్వరలోనే విడుదల కాబోతున్న ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు కూడా ఇబ్బందులు వస్తాయేమో అనిపిస్తోంది..
ముందుగా ఫైటర్ కేసు సంగతి చూద్దాం… ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హృతిక్-దీపిక ఓ లిప్ కిస్ సీన్ చేశారు. అందులో తప్పులేదు కానీ వైమానిక దళం యూనిఫామ్ లో, రన్ వే పై ఆ సీన్ చేయడాన్ని ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ ఛాలెంజ్ చేశారు. దేశ ఔన్నత్యానికి, వైమానిక దళం ప్రతిష్టకు అది భంగం కలిగిస్తుందంటూ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించారు.
ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ విషయానికొద్దాం.. ఈ సినిమా కూడా వైమానిక దళం నేపథ్యంలో తెరకెక్కిందే. దేశంలోని వైమానికదళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అద్భుతంగా చూపించామని మేకర్స్ చెప్పుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ తాజాగా రిలీజ్ చేసిన స్టిల్ మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
ఆపరేషన్ వాలంటైన్ లో కూడా ఓ మాంఛి రొమాంటిక్ సీన్ ఉన్నట్టుంది. హీరోయిన్ మానుషి టవల్ చుట్టుకొని, జుట్టు విరబూసుకొని ఉంది. తన రెండు చేతులతో హీరోను రొమాంటిక్ గా చుట్టుకుంది. ఇక ముద్దు పెట్టుకోవడమే ఆలస్యం అన్నట్టుంది ఈ స్టిల్.
ఇక్కడ హీరో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ఉన్నాడు. పైగా జాతీయ జెండా స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఫైటర్ లో సన్నివేశానికి కోర్టు అభ్యంతరం తెలిపితే, ఈ సన్నివేశం కూడా కచ్చితంగా అభ్యంతరకరమే.