పచ్చ మీడియా.. ‘తాము చేస్తే శృంగారం..’ నీతి!

తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం.. అని చాటి చెప్పేది సుప్రసిద్ధమైన కుటిల నీతి. నిత్యం చంద్రబాబు భజన చేస్తూ ఉండడంలో తమను తాము పునీతం చేసుకుంటూ ఉండే పచ్చమీడియా.. జగన్మోహన్ రెడ్డిని…

తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం.. అని చాటి చెప్పేది సుప్రసిద్ధమైన కుటిల నీతి. నిత్యం చంద్రబాబు భజన చేస్తూ ఉండడంలో తమను తాము పునీతం చేసుకుంటూ ఉండే పచ్చమీడియా.. జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఇతరులు ఎవరైనా కించిత్తు పొగిడినా సరే సహించలేకపోతోంది.

ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వాళ్లు, అంతర్జాతీయ ప్రముఖులు జగన్ ఆలోచనలకు, పరిపాలనకు, పథకాలకు కితాబు ఇస్తే ఏమాత్రం ఓర్వలేకపోతోంది. వారందరూ జగన్ భజన చేస్తున్నారంటూ అడ్డగోలుగా పిచ్చి రాతలు రాస్తున్నారు.

ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ప్రసంగాన్ని ఏర్పాటుచేశారు. సాధారణంగా మోటివేషనల్ స్పీకర్లు .. ప్రంపంచలో ఎక్కడ మాట్లాడినా స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకుని, అక్కడి వ్యవహారాలను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అదే వారి ప్రసంగాలకు నేటివ్ టచ్ ను యాడ్ చేస్తుంది. వారి ప్రసంగాలు మూసగా లేకుండా చూస్తుంది.

నిక్ వుజిసిక్ విశాఖలో కూడా అదే పని చేశారు. ఆయన జగన్ పాలనను ప్రస్తావించారు. జగన్ దార్శనికతను, విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులలో ఉండే చిత్తశుద్ధిని కొనియాడారు. దేశంలో ఎంతో మంది యువతకు జగన్ పాలన ఆదర్శం అని పేర్కొన్నారు. విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఇంగ్లిషు మీడియం, అమ్మఒడి విషయాలను కూడా ప్రస్తావించారు.

నిజం చెప్పాలంటే.. నిక్ వుజిసిక్ చెప్పినా చెప్పకపోయినా ఈ పథకాల గొప్పదనం, విద్యారంగంలో జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి అందరికీ తెలుసు. అయితే.. వుజిసిక్ మాటలు పచ్చ మీడియాకు మాత్రం భజనలాగా కనిపించాయి. మోటివేషనల్ స్పీకరుతో కూడా జగన్ భజన చేయించారంటూ.. అడ్డంగా రాతలు రాశారు.

చంద్రబాబునాయుడు పాలనలో అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ఎవరు వచ్చినా సరే.. వారితో తనను పొగిడించుకోవడమే పనిగా ఆయన పెట్టుకునే వారు. వారితో కలిసి వేదిక మీద కూర్చుని తనను పొగిడించుకోవడం చంద్రబాబుకు ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేది. అప్పుడంతా.. ఆ అంతర్జాతీయ వ్యక్తుల పొగడ్తలు పచ్చమీడియా కు చాలా రుచికరంగా కనిపించినట్టు ఉంది.

ఇప్పుడు దివ్యాంగుడైన ఓఅత్యద్భుత వ్యక్తి, మోటివేషనల్ స్పీకరు నిక్ వుజిసిక్  జగన్ గురించి.. అది కూడా కేవలం విద్యారంగంలో పురోగతి గురించి మంచి మాటలు చెప్పినా సహించలేకపోతున్నారు. ఇలాంటి స్పీకర్స్ తాము మనసులోని మాట‌లు పెయిడ్ ఆర్టిస్టుల్లాగా చెప్పరని, చెబితే తమ పరువే పోతుందని భయపడతారని.. పెయిడ్ ఆర్టికల్స్ రాసుకునే పచ్చ మీడియాకు ఎప్పటికి అర్థం అవుతుందో మరి.