తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అనారోగ్యం కారణంగా విశ్రాంతికి పరిమితం కాబోవడం లేదు. దేహస్థితి పూర్తిగా సహకరించే పరిస్థితి లేకపోయినప్పటికీ.. ఆయన పూర్త స్థాయిలో రాజకీయ సమరానికి సిద్ధం అవుతున్నారు.
కాంగ్రెసు ప్రభుత్వంతో తలపడడానికి ఆయత్తం అవుతున్నారు. ప్రభుత్వంతో తలపడడం కంటె ఆయన ముందున్న ప్రస్తుత ప్రధాన బాధ్యత పార్టీని కాపాడుకోవడం. మునిసిపాలిటీలు తమ పట్టునుంచి జారిపోతున్నాయి. ఒక ఎంపీ కూడా కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేలలో చాలా మంది సంగతి సందేహాస్పదంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ఎవ్వరూ బయటకు వెళ్లకుండా పార్టీకి కంచె వేసుకోవడం కేసీఆర్ ప్రథమ లక్ష్యంగా మారినట్టుగా కనిపిస్తోంది.
సాధారణంగా బయటినుంచి ఎవరూ లోపలకు రాకుండా పొలానికి కంచె వేస్తారు. కానీ.. రాజకీయ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కు మాత్రం లోని నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకుండా కంచె వేసుకోవాల్సిన పరిస్థితి. తమ పార్టీ తరఫున గెలిచినప్పటికీ.. తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి వచ్చిన ఎమ్మెల్యేలు అందరి మీద ఫిరాయిస్తారనే సందేహాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఆత్మీయభేటీ అని చెప్పిన వారు మాత్రమే కాకుండా.. మూడు రంగుల కండువా కప్పించుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
కాంగ్రెస్ సర్కారు త్వరలోనే కూలిపోతుందని భారాస నేతలు అంటూ ఉంటే.. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీనే ఖాళీ అవుతుందని కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. భారాస ఎమ్మెల్యేగా ఉంటూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెసులో చేరిన మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు గమనించదగినవి.
గులాబీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజిగిరి స్థానాన్ని కూడా కోల్పోయిన మైనంపల్లి, కొడుకును ఎమ్మెల్యే చేయాలనే కోరిక మాత్రం తీర్చుకోగలిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లోగానే.. భారాసకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరుతారని జోస్యం చెప్పడం గమనార్హం.
ఆ పార్టీకి ఉన్నదే 39 మంది. 26 మంది వెళ్లడం అంటే.. మూడింట రెండొంతుల మంది వెళ్లిపోయినట్టే. చీలికవర్గమే అసలు పార్టీగా గుర్తింపు పొందేలాంటి పరిస్థితి వస్తుందని చెప్పడానికి ఆయన 26 అనే సంఖ్యను చెప్పారా? లేదా, నిజంగానే 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసువైపు చూస్తున్నారా? అనేది తెలియడం లేదు. పార్టీ కీలకనేత హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరుతారని కూడా మైనంపల్లి జోస్యం చెబుతున్నారు. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు ఆయన 26 అంటే అందులో సగం మంది అయినా కాంగ్రెస్ వైపు చూస్తుండవచ్చు.
మరి గెలిచిన ఎమ్మెల్యేలు చేజారి వెళ్లిపోకుండా కాపాడుకోవడమే కేసీఆర్ ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు ప్రభుత్వంపై ప్రారంభిస్తున్న పోరాటాలన్నీ కూడా పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలిగించడానికే. ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం పుడుతోందనే ప్రచారం ప్రారంభిస్తే.. పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి కాస్త ముందు వెనుక ఆలోచిస్తారని కేసీఆర్ వ్యూహంగా ఉంది. మరి పార్టీకి కంచెవేసుకునే ప్రయత్నాల్లో కల్వకుంట్ల వారు ఏమేర సఫలీకృతులు అవుతారో వేచిచూడాలి.