విజయనగరం అంటే రాజుల కోటగా పేరు. అక్కడ నుంచి అత్యధిక సార్లు రాజులు గెలిచారు. పూసపాటి వారి సంస్థానాధీశులు గతంలో విజయనగరాన్ని పాలించారు. ప్రజాస్వామ్య యుగంలో కూడా వారే వరసగా నెగ్గుతూ వస్తున్నారు.
అయితే రాజుల కోటకు అపుడపుడు బీటలు వారిన సందర్భాలు ఉన్నాయి. రెండు సార్లు కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఆయన అశోక్ గజపతిరాజునే ఓడించి గెలిచారు. ఆనాడు అశోక్ మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు.
రెండవసారి 2019లో అశోక్ కుమార్తెని ఓడించారు. 2024లో కోలగట్ల పోటీ చేస్తారా ఆయనకు టికెట్ ఇస్తారా అన్నది ఇంకా ఏమీ తేలలేదు. విజయనగరం అసెంబ్లీ సీటులో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దాంతో వైసీపీ ఏమి చేస్తుందో తెలియదు. టీడీపీ అయితే అశోక్ ని పోటీ చేయమని కోరుతోంది. ఆయన తన కుమార్తె అదితి గజపతిరాజుకు ఈ సీటు ఇచ్చేశారు అని టాక్ నడుస్తోంది. ఆమె ప్రచారం కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం తధ్యమని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితులల్లో యాదవ సామాజిక వర్గం విజయనగరంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకు ఇవ్వాలని ఆ సామాజికవర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాదవుల ఓట్లు విజయనగరం అసెంబ్లీ పరిధిలో 65 వేలకు పైగా ఉన్నాయని తమకు మాత్రం ఎపుడూ సీటు ఇవ్వలేదని వారు అంటున్నారు. విజయనగరం జిల్లాలో రెండు లక్షల యాభై వేల దాకా యాదవులు ఉన్నారని అంటున్నారు.
తమను మునిసిపాలిటీ స్థాయి పదవులకే పరిమితం చేశారు తప్ప ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని వారు ఆక్షేపిస్తున్నారు. జిల్లాలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ముప్పయి వేల దాకా ఓట్లు యాదవులకు ఉన్నాయని తమ మద్దతు లేకుండా ఏ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవలేదు అని హెచ్చరిస్తున్నారు.
మేమే గెలిపిస్తాం, మేమే ఓడిస్తాం కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకుని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఈసారికి ఇవ్వాల్సిందే అని యాదవులు కోరుతున్నారు. వైసీపీ టీడీపీ అధినాయకత్వాలు ఈ డిమాండ్ మీద ఏమి చేస్తారో తెలియదు కానీ రాజుల కోటలో కొత్త గొంతుకలు అనేకం అయితే ఇపుడు వినిపిస్తున్నాయని చెప్పాలి. ఇది సామాజిక చైతన్యానికి ప్రతీకలుగా కూడా చూడాలి.