ఢిల్లీకి బాబు.. పొత్తు మంతనాల్లో చివరి అంకం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తన ఒక్కరి బలం సరిపోదనే విశ్వాసంతో.. అందరినీ పోగేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు.. పొత్తుల పేరిట జరుగుతున్న ఈ ప్రహసనాన్ని చివరి అంకంలోకి తీసుకువచ్చారు. Advertisement ఇప్పటికే తెలుగుదేశం జనసేన…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తన ఒక్కరి బలం సరిపోదనే విశ్వాసంతో.. అందరినీ పోగేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు.. పొత్తుల పేరిట జరుగుతున్న ఈ ప్రహసనాన్ని చివరి అంకంలోకి తీసుకువచ్చారు.

ఇప్పటికే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తులు కుదిరాయి. ఇద్దరూ కలిసి మెలిసి అడుగులు వేస్తున్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా దాదాపుగా పూర్తయినట్లే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ జట్టులోకి భారతీయ జనతా పార్టీ కూడా చేరుతుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు.

ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత.. తాజాగా చంద్రబాబునాయుడు స్వయంగా ఢిల్లీ వెళుతున్నారు. ఇదమిత్థంగా ఇదీ ఆయన టూర్ ఎజెండా అని బయటకు రాలేదు గానీ.. బిజెపి అధిష్ఠానం పెద్దలను కలవబోతున్నారు. వారికి ఏం కావాలో తెలుసుకోబోతున్నారు.

తన పార్టీ సారథ్యంలోని జట్టులోకి వస్తే.. వారికి తన ఆఫర్ ఏమిటో వివరించబోతున్నారు. మొత్తానికి కమలంతో కూడా పొత్తు ఉంటుందో లేదో ఈ టూర్ తర్వాత ఒక కొలిక్కి వస్తుంది.

2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలూ కలిసే పోటీచేశాయి. అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో మంత్రి పదవులు పుచ్చుకుని చంద్రబాబు కూడా అధికారం పంచుకున్నారు. తమ స్వార్థం కోసం ప్రత్యేక హోదా డిమాండ్ ను పట్టించుకోకుండా, ఉద్యమాల్ని అణిచేస్తూ బిజెపికి ఊడిగం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేశారు చంద్రబాబు.

తీరా పదవీకాలం ముగిసి ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన కొత్త డ్రామా ప్రారంభించి.. హోదా రాకపోవడానికి మోడీనే కారణం అంటూ ఆయన మీద ధర్మపోరాటాలు ప్రారంభించారు. అయితే ఆయన పాచిక పారలేదు. కుయుక్తులు ఫలించలేదు. ఆయన ఊహకు భిన్నంగా కేంద్రంలో నరేంద్రమోడీ తిరుగులేని మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏపీలో చంద్రబాబు పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆయన ప్రత్యేకహోదా పోరాట నాటకాల్ని ప్రజలు నమ్మలేదు. 

ఆ తర్వాత నుంచి బిజెపి పట్ల మెతకవైఖరినే అవలంబిస్తూ వచ్చారు. జనసేన తెలుగుదేశానికి మద్దతు పలికిన నాటి నుంచి.. బిజెపిని కూడా కలుపుకోవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. బిజెపి నాయకుల్లో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. రాష్ట్రాపార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు.. పొత్తు కోరుకుంటున్నారు. అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. బిజెపిలో ఉన్న చంద్రబాబు కోవర్టులు అందరూ బలంగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు స్వయంగా చంద్రబాబు కమలనాయకులతో చర్చలకు ఢిల్లీ వెళుతున్నారు. పార్లమెంటు సీట్ల విషయంలో ఉదారంగా ఉంటూ, ఎమ్మెల్యే సీట్లను తక్కువ కేటాయించే ఆఫర్ తో ఆయన పొత్తులు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చంద్రబాబు మంత్రాంగం ఫలిస్తుందో లేదో రెండు రోజుల్లో తేలుతుంది.