ముస్లింలు కన్నెర్ర చేయడంతో టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ పరుగులు తీయాల్సిన దుస్థితి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలు, దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ ముఖ్య నేతలు తీవ్ర ఆరోపణలు చేసే సంగతి తెలిసిందే.
అయితే తన పార్టీ నాయకురాలే దాదాగిరి చేస్తున్నా చంద్రబాబు, లోకేశ్ కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు, ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో బాధితులే తిరగబడి వెంట పడాల్సిన పరిస్థితి ఆళ్లగడ్డలో నెలకుంది. ఈ నేపథ్యంలో బాధితుల ఆగ్రహానికి గురైన అఖిలప్రియ …వారి నుంచి తప్పించుకోడానికి పోలీసుల రక్షణలో పరుగులు తీసిన వైనం చర్చనీయాంశమైంది.
ఏడాదిన్నర క్రితం తన ఇంటి వద్దకు పంచాయితీకి వచ్చిన రెహమాన్ అనే మైనార్టీ వ్యక్తిపై దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ.1.30 కోట్ల సొమ్మును అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ లాక్కున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై బాధితుడు ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. అయితే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని వెనుక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్టు ఆళ్లగడ్డ కోడై కూస్తోంది.
అఖిలప్రియ ఆగడాలు ఎంత ఎక్కువైతే తనకు అంత మంచిదని, ఆమెకు చెడ్డపేరు వస్తే, తనకు రాజకీయంగా లాభమని బ్రిజేంద్ర ఎత్తుగడ. అందుకే ఆళ్లగడ్డ, నంద్యాలలో అఖిలప్రియ యథేచ్ఛగా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి భూములు విక్రయించినా, రెహమాన్ లాంటి మైనార్టీ వ్యక్తిపై దాడికి పాల్పడి కోట్లాది రూపాయలు దోచుకున్నా ఎలాంటి చర్యలు లేవు.
ఈ నేపథ్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రుద్రవరం గ్రామానికి అఖిలప్రియ మంగళవారం రాత్రి చీకటి పడ్డాక వెళ్లారు. రెహమాన్ వద్ద దోపిడీ చేసిన రూ.1.30 కోట్లు ఇవ్వాలంటూ అఖిలప్రియను ముస్లింలతో పాటు ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చుట్టుముట్టారు. దోచుకున్న డబ్బు చెల్లించకపోతే కదలనివ్వబోమని హెచ్చరించారు. ఒకదశలో ఆమెను బంధించాలని ప్రజలు సిద్ధమయ్యారు.
దీంతో భయాందోళనకు గురైన అఖిలప్రియ అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడంతో అఖిలప్రియ తప్పించుకుని, అక్కడి నుంచి పరారైనట్టు తెలిసింది. ఈ సందర్భంలో ఒక్కొక్కరిని ఊచకోత కోస్తామని అఖిలప్రియ హెచ్చరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో మరి!