విశాఖ అందుకే రాజధాని కావాలి!

విశాఖ ఎందుకు రాజధాని అని వితండ వాదన చేసేవారికి ఎవరూ చెప్పలేరు. కానీ విశాఖ ఏపీకి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అని అంతా అనుకుంటే మాత్రం తప్పనిసరిగా రాజధాని కావాల్సిందే. ఇదే విషయం…

విశాఖ ఎందుకు రాజధాని అని వితండ వాదన చేసేవారికి ఎవరూ చెప్పలేరు. కానీ విశాఖ ఏపీకి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అని అంతా అనుకుంటే మాత్రం తప్పనిసరిగా రాజధాని కావాల్సిందే. ఇదే విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ లో చెప్పారు.

దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని అన్నారు. అవి ఆదాయాలు ఇచ్చే రాజధానులు అని చెప్పారు. హైదారాబాద్ ని రాజధానిగా కోల్పోవడం వల్ల ఏటా పదమూడు వేల కోట్ల రూపాయలు ఏపీ నష్టపోతోంది అని కూడా జగన్ వివరించే ప్రయత్నం చేశారు.

విశాఖను తాను రాజధానిగా చేయాలనుకుంది ఏపీ శ్రేయస్సు కోసమే అని చెప్పారు. ఏపీకి గ్రోత్ ఇంజన్ గా విశాఖ ఉంటుంది. విశాఖ రెడీ మేడ్ క్యాపిటల్ సిటీ. ఏవీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు, జల వాయు, రోడ్డు రైల్ కనెక్టివిటీ ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది విశాఖ. అలాంటి విశాఖను ఎవరైనా రాజధానిగా చేసుకుంటారు. ఏదో ఏపీకి మూల ఉందని పక్కన పెట్టరు.

ఈ రోజున కనెక్టివిటీ పెరిగిన తరువాత దూరం కూడా తగ్గిపోయింది. అందువల్ల విశాఖను రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకోవడం మంచిదే అన్నది జగన్ తన ప్రసంగం ద్వారా మరోసారి ప్రజలకు తేటతెల్లం చేశారు. అయితే దీని మీద టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అమరావతి వంటి రాజధానిని చంపేసి ఇపుడు జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు అని నారా లోకేష్ అంటున్నారు.

అయితే నిజంగా చంపడానికైనా అమరావతి అన్న రాజధాని ఉందా అన్నది చూడాలి కదా. రాజధాని అంటే ఒక అభివృద్ధి చెందిన నగరం. జన జీవితం ఉండే సిటీ. అన్ని వర్గాలు అన్ని భాషల ప్రజలు ఒక్కటిగా కలసిమెలిసే ప్రాంతాన్నే రాజధానిగా చెప్పుకోవచ్చు.

అలాంటి లక్షణాలు విశాఖకు ఉన్నాయి. హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందే సామర్ధ్యం విశాఖకు ఉంది. అందువల్ల విశాఖ రాజధానిగా ఉండాల్సిందే అన్నది మేధావుల మాట. అయితే రాజకీయ సుడిగుండంలో పడి విశాఖ రాజధాని యోగం కొట్టుకుని పోయింది.

అమరావతి రాజధాని పేరు చెప్పుకుని మరో అయిదు పదేళ్ళు ఇలాగే కాలక్షేపం చేయాలనుకుంటే నష్టం రాష్ట్రానికే తప్ప విశాఖకు కాదు కదా. విశాఖ కూడా ఈ రోజున ఈ రూపునకు షేపునకు రావడానికి దశాబ్దాల కాలం పట్టింది. అమరావతి మీద అంత మక్కువ ఉంటే దాన్ని కూడా డెవలప్ చేయవచ్చు. అయితే ఏపీకి గ్రోత్ ఇంజన్ గా ఒక సిటీని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచన మాత్రం పాలకులు ఎప్పటికైనా చేయాల్సి ఉంది. ఒకటి కంటే రెండు మూడు రాజధానుల కళ ఉన్న సిటీలు ఏపీకి  ఉంటే తప్పేంటి.