ఫైటర్ కు మరో ఎదురుదెబ్బ

ఫైటర్ కు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద దెబ్బ తగిలింది. మిగతా ప్రాంతాల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లపై పెద్ద ప్రభావం చూపించింది. ఇప్పుడీ సినిమాకు మరో ఎదురు దెబ్బ. ఫైటర్…

ఫైటర్ కు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద దెబ్బ తగిలింది. మిగతా ప్రాంతాల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో వసూళ్లపై పెద్ద ప్రభావం చూపించింది. ఇప్పుడీ సినిమాకు మరో ఎదురు దెబ్బ. ఫైటర్ సినిమాపై కేసు నమోదైంది.

సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన లిప్ కిస్ సీన్ పై చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసు వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ ఈ కేసు దాఖలు చేశారు. సినిమాల్లో ముద్దు సీన్లు కొత్త కాదు. ఎటొచ్చి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో ఇలా లిప్ కిస్ పెట్టుకోవడాన్ని సౌమ్య దాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ కేసు.

యూనిఫామ్ లో ఇలా మూతి ముద్దులు పెట్టుకోవడం, భారత వైమానిక దళం, అందులోని అధికారుల పరువు తీసిందని, ఇది తీవ్ర అవమానమని, ఎయిర్ ఫోర్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ నోటీసులో పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ యూనిఫాం అనేది కేవలం డ్రెస్ మాత్రమే కాదని.. అది దేశ గౌరవమని, నిస్వార్థ సేవకు గుర్తు అని, నిబద్ధతకు చిహ్నమని నోటీసులో పేర్కొన్నారు.

అలాంటి పవిత్రమైన దుస్తులు ధరించి, లిప్ కిస్ పెట్టుకోవడాన్ని సదరు అధికారి తీవ్రంగా నిరశించారు. ఇలాంటి అనుచితమైన ప్రవర్తనలు ఎయిర్ ఫోర్స్ ఔన్నిత్యాన్ని దెబ్బతీస్తాయని ఆమె అన్నారు. కేవలం నైతికంగానే కాకుండా, సాంకేతికంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు సౌమ్య.

ఎయిర్ ఫోర్స్ కు చెందిన రన్ వేను అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారని, ఎంతో భద్రతతో కూడిన అలాంటి రన్ వేపై శృంగారభరితంగా కనిపించడం తప్పు అంటున్నారు. ఈ సినిమా చూసి భవిష్యత్తులో ఎవరైనా రన్ వే పై అలా ప్రవర్తిస్తే, దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ నోటీసులపై ఫైటర్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.