‘మహా’ బాబాయికి మహా షాక్ !

దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆయనది కాకుండాపోయింది. ఆయన చేతినుంచి జారిపోయింది.…

దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆయనది కాకుండాపోయింది. ఆయన చేతినుంచి జారిపోయింది.

పార్టీలో తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలను చీల్చి అసెంబ్లీలో బిజెపి శివసేన ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన అజిత్ పవార్ సారథ్యంలో ఉన్నదే అసలైన ఎన్సీపీ పార్టీ అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో శరద్ పవార్.. తాను స్థాపించిన సొంత పార్టీకి ఇప్పుడు తాను బయటి వ్యక్తి అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లోగా.. ఆయన తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను పరిగణించేందుకు ఒక కొత్త పార్టీ పేరుతోముందుకు రావాల్సి ఉంటుంది.

మహా రాష్ట్ర రాజకీయాలు.. విభజన రాజకీయాల్లో రకరకాల మైల్ స్టోన్స్ గా నిలుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీలను చీల్చేస్తున్నదని, చిన్న పార్టీలను కబళించేస్తున్నదని పలు ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. రాష్టాల్లో భాజపా అధికారంలోకి రావడానికి చిన్న పార్టీలను చీల్చి వాటికి అధికారం ఎర వేస్తున్నదనే వాదన ఉంది.

మహారాష్ట్రలో బాల్ థాకరే స్థాపించిన శివసేన పార్టీ బిజెపి రాజకీయ మంత్రాంగంలో నిట్టనిలువునా చీలిపోయింది. ఏక్‌నాధ్ షిండే నేతృత్వంలో పార్టీని చీల్చి ఆయనను ముఖ్యమంత్రిగా చేసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటైంది. థాకరే వారసులు దూరం అయ్యారు. ఏక్ నాధ్ షిండే నేతృత్వంలో ఉన్నదే అసలైన శివసేన అని ఈసీ గుర్తించడమూ జరిగింది.

ఈ లోగా శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా చీలింది. తన బాబాయిని ఖంగు తినిపిస్తూ అజిత్ పవార్ మెజారిటీ శాసన సభ్యులతో పార్టీని చీల్చి అసెంబ్లీలో ప్రభుత్వపక్షంలో చేరారు.  అప్పటినుంచి ఉన్న వివాదాన్ని ఈసీ పరిష్కరిస్తూ అజిత్ నాయకత్వంలో ఉన్నదే అసలు పార్టీ అని తేల్చింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే గాకుండా దేశరాజకీయాల్లోనే కురువృద్ధుడిగా గుర్తింపు ఉన్న శరద్ పవార్ కు షాక్ తగిలినట్టే. ఇప్పటికే విరక్తితో రాజకీయాల నుంచి ఒకమారు సన్యాసం ప్రకటించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

ఎన్సీపీకి చెందిన ఎన్నికల గుర్తు గడియారం కూడా ఇక అజిత్ నేతృత్వంలోని పార్టీకే చెందుతుంది. శరద్ పవార్ తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల కోసం కొత్త పేరు పెట్టుకోవాలి.. కొత్త గుర్తు వెతుక్కోవాలి. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలే కాకుండా.. ఇండియా కూటమిలో కీలక నాయకుడు అయిన శరద్ పవార్ కు తగిలిన ఈ దెబ్బ దేశ రాజకీయాల్లోనే ఒక ముఖ్య పరిణామంగా పలువురు భావిస్తున్నారు.