న‌న్ను వ‌దిలేయండి.. వైసీపీకి వేమిరెడ్డి వేడుకోలు!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, అజాత శ‌త్రువుగా పేరు పొందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ‌కీయాల‌పై తీవ్ర వైరాగ్యంలో ఉన్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ అనుచిత వైఖ‌రితో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం…

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, అజాత శ‌త్రువుగా పేరు పొందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాజ‌కీయాల‌పై తీవ్ర వైరాగ్యంలో ఉన్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ అనుచిత వైఖ‌రితో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ట్టు వైసీపీ నేత‌లే చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఉన్నారు.

నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి వేమిరెడ్డిని బ‌రిలో దించేందుకు వైసీపీ సిద్ధ‌మైంది. అయితే త‌న‌కు తెలియ‌కుండానే నెల్లూరు సిటీ అభ్య‌ర్థిగా ఖ‌లీల్‌ను ఎంపిక చేయ‌డం, అలాగే ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ ఇష్టానురీతిలో తిడుతున్నా పార్టీలో ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో వుంది. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంపతుల‌ను అనిల్‌కుమార్ అంద‌రి ద‌గ్గ‌ర నోటికొచ్చిన‌ట్టు తిడుతున్నార‌నే ప్ర‌చారం వుంది.

ఈ విష‌యం వేమిరెడ్డి దంప‌తుల‌కు చేరింది. పార్టీకి అన్ని ర‌కాలుగా అండ‌గా వుండే త‌న‌తో పాటు త‌న భార్య‌ను కూడా అనిల్ తిట్టాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని వైసీపీ పెద్ద‌ల వ‌ద్ద వేమిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని తెలిసింది. వేమిరెడ్డి అల‌క‌బూన‌డంతో ఇక ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ర‌ని ప్ర‌చారం చేయ‌డంతో పాటు నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తారా? అని చెన్నైకి చెందిన ప్ర‌ముఖ తెలుగు పారిశ్రామిక వేత్త‌ల‌ను అనిల్ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు.

ఈ స‌మాచారం వేమిరెడ్డిని మ‌రింత బాధ‌పెడుతోంది. వైసీపీలో అనిల్‌కు అంత ప్రాధాన్యం ఇస్తున్న‌ప్పుడు ఇక తన అవ‌స‌రం ఏముందిలే అని వేమిరెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. త‌న‌ను బుజ్జ‌గించ‌డానికి వెళ్లిన వైసీపీ పెద్ద‌ల‌తో.. ఇక త‌న‌ను వ‌దిలేయాల‌ని, రాజ‌కీయాల‌కో దండం అని అన్న‌ట్టు తెలిసింది. సీఎం జ‌గ‌న్ మంచి వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న పేరుతో అనిల్ అరాచ‌కాలు చేస్తున్నార‌ని వైసీపీ పెద్ద‌ల వ‌ద్ద వేమిరెడ్డి ఆక్రోశం వెళ్ల‌గ‌క్కార‌ని తెలిసింది.

ఒక‌వైపు జ‌గ‌న్‌ను ఆకాశానికెత్తుతూ, మ‌రోవైపు నెల్లూరు జిల్లాలోని సొంత పార్టీ నాయ‌కుల్ని అనిల్ తిడుతున్నాడ‌ని, ఈ విష‌యం తెలిసి కూడా అత‌న్ని ప్రోత్స‌హించ‌డంపై వైసీపీ పెద్ద‌ల్ని వేమిరెడ్డి నిలదీశార‌ని స‌మాచారం. ద‌య‌చేసి త‌న‌ను వదిలేయాల‌ని, రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం రెండు నెలల్లో ముగుస్తుంద‌ని, త‌న మానాన తాను బ‌తుకుతాన‌ని విన్న‌వించిన‌ట్టు వైసీపీ నేత‌లు తెలిపారు.

ప్ర‌స్తుతం వేమిరెడ్డి చెబుతున్న మాట‌ల్ని వింటే… రానున్న ఎన్నిక‌ల్లో నెల్లూరు ఎంపీగా ఆయ‌న పోటీ చేసే ప‌రిస్థితి లేద‌ని స‌మాచారం.