బేబీలో బూతులు.. తప్పలేదంటున్న దర్శకుడు

బేబి సినిమా వచ్చింది. సినిమాలో చాలా చోట్ల బూతులతో ముంచెత్తింది. మ్యూట్లు పడినా మేటర్ ఏంటనేది సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉన్నాయి ఆ బూతులు. ఓవర్సీస్ లో అయితే కనీసం ఆ మ్యూట్లు కూడా…

బేబి సినిమా వచ్చింది. సినిమాలో చాలా చోట్ల బూతులతో ముంచెత్తింది. మ్యూట్లు పడినా మేటర్ ఏంటనేది సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉన్నాయి ఆ బూతులు. ఓవర్సీస్ లో అయితే కనీసం ఆ మ్యూట్లు కూడా లేవు.

ఇప్పుడీ విషయంపై దర్శకుడు సాయిరాజేష్ స్పందించాడు. బూతులు పెట్టక తప్పలేదంటున్నాడు. పైగా అవసరం ఉన్నచోట మాత్రమే బూతులు పెట్టానంటున్నాడు. బూతులు పెట్టాను కాబట్టే కథ ముందుకు సాగిందంటున్నాడు.

“బూతులు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి, నాకు తెలుసు. ఇంకా చాలా బూతులున్నాయి, సెన్సార్ లో చాలా పోయాయి. ఈ సినిమా ఇలా 'రా' గానే ఉండాలని అనుకొని తీశాను. బూతులు/బ్యాడ్ వర్డ్స్ వల్ల 10 టికెట్లు ఎక్కువ తెగుతాయని పెట్టలేదు. ఆ బూతు పదం వల్ల కథ కొంచెం ముందుకు వెళ్తుంది. కథలో పాత్రల స్వభావాలు మారుతాయి. అందుకే పెట్టాను. పైగా బూతులు అవసరం ఉన్నచోట మాత్రమే పెట్టాను, అవసరం లేని చోట పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే, ఈ కథకు బూతులు పెట్టక తప్పలేదు.”

ఇలా తను పెట్టిన బూతుల్ని సమర్థించుకున్నాడు దర్శకుడు. అదే విధంగా కాస్త ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని కూడా సమర్థించుకున్నాడు. ఆమాత్రం లెంగ్త్ లేకపోతే ఈ సినిమా కథను చెప్పలేమంటున్నాడు.

“ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ ఒకటిన్నర నిమిషం తగ్గిస్తే బాగుంటుందని స్వయంగా అరవింద్ చెప్పారు. నన్నే నిర్ణయం తీసుకోమన్నారు. స్టుడియోలో ఆ సీన్ కట్ చేసి చూస్తుంటే, అమ్మాయి పాత్ర చెడ్డగా మారిపోతోంది. సినిమా పోయినా పర్లేదు, వసూళ్లు తగ్గినా పర్వాలేదు, అమ్మాయి పాత్ర పోకూడదని నిర్మాతను రిక్వెస్ట్ చేశాను. కట్ చేయకుండా ఉంచేశాం. ఫాదర్, మదర్ రోల్స్ ను కట్ చేసేశాను. అందుకే అక్కడక్కడ వివాదాలు వస్తున్నాయి. ఈ కథకు నిడివి ఇంతే.”

లెంగ్త్ ఎక్కువైపోతోందనే ఉద్దేశంతో, సినిమాలో కొన్ని పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చి మరీ కట్ చేయాల్సి వచ్చిందని, భవిష్యత్తులో వాటికి సంబంధించి క్షమాపణలు చెప్పాల్సి రావొచ్చని అన్నాడు దర్శకుడు.