జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెళ్లిళ్లే కాదు, పొత్తులు కూడా పెద్దగా అచ్చొస్తున్నట్టుగా లేవు! తన వ్యక్తిగత జీవితంలో పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఇద్దరి భార్యలకు అధికారికంగా విడాకులు ఇచ్చి, మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అధికారికంగా! మరి ఈ పెళ్లిళ్ల వ్యవహారాలు అన్నీ సజావుగా జరిగినవి ఏమీ కావు! ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సీపీఐ నారాయణ విమర్శించాడని పవన్ కల్యాణ్ పెళ్లికి పూనుకున్నారు! రేణూ దేశాయ్ తో పవన్ కల్యాణ్ పెళ్లికి ఒక రకంగా సీపీఐ నారాయణే కారణం!
అప్పటికే రేణూతో పవన్ కల్యాణ్ సహజీవనం, పిల్లాడు పుట్టడం వంటివన్నీ జరిగాయి. ఈ అంశంపై వీర కమ్యూనిస్టు నారాయణ విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి నీతులు చెబుతున్న పవన్ కల్యాణ్ కథేంటంటూ.. అప్పట్లో నారాయణ విమర్శించడం, దాన్ని పచ్చమీడియా పతాక శీర్షికలకు ఎక్కించడంతో ఇలా కాదని.. అప్పటికప్పుడు పెళ్లికి పూనుకుని పవన్ ఆ తతంగం పూర్తి చేశారు. ఆ తర్వాత తనతో పెళ్లిలో ఉండగానే.. పవన్ కల్యాణ్ మరో మహిళతో బిడ్డకు తండ్రి అయ్యాడంటూ రేణూ దేశాయ్ వాపోయారు!
ఇది మీ ఇళ్లలో వారికి జరిగితే ఊహించుకోండంటూ పవన్ వీరాభిమానులకు కూడా ఆమె ఒక వీరతాడు వేశారు! అలా పెళ్లిళ్ల వ్యవహారంలో ఎంత గజిబిజిగా వ్యవహరించాడో.. ఆ పై ఆ వ్యవహారాలను పవన్ ఎలా దబాయిస్తారో.. రాజకీయంలో కూడా ఆయన కథ ఇలానే సాగుతూ ఉంది!
పదేళ్ల కిందట పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. ఆరంభంలోనే టీడీపీతో పొత్తు అన్నారు, కాంగ్రెస్ హఠావో అన్నారు! బీజేపీతోనూ పొత్తుకు దిగారు. అప్పటి వరకూ తను చెప్పిన చేగువేరా ఆదర్శాలను పాతిపెట్టి.. కాషాయం కట్టారు! మరి దాన్నైనా సరిగా ధరించారా అంటే.. 2019 నాటికి మళ్లీ చంద్రబాబు అవసరాల మేరకు ఎర్ర పార్టీలతో వెళ్లారు! భగత్ సింగ్ అన్నారు, ఏదేదో అన్నారు! మళ్లీ కాషాయంతో దోస్తీ అని ప్రకటించారు!
మరి ఇప్పుడు కాషాయంతో పవన్ దోస్తీ కథ ఏమైందో ఎవరికీ తెలీదు! మొన్నామధ్య ఎన్డీయే సమావేశానికి కూడా హాజరైన పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుతో సాగిస్తున్న పొత్తు చర్చల్లో, సీట్ల సర్దుబాట్లలో బీజేపీ ఊసు లేదు! ఒకవైపు ఎన్డీయేలో ఉంటూ, బీజేపీకి దోస్తు అని ప్రకటించుకుని, ఎన్డీయేలో లేని, బీజేపీకి దోస్తు కాని చంద్రబాబుతో పవన్ సీట్ల చర్చలు సాగిస్తున్నారు! బేరం కుదుర్చుకుంటున్నారు!
ఇదంతా పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారాన్నే గుర్తు చేస్తోంది. సహాజీవనం, పెళ్లి, విడాకులు, మధ్యలో ఇంకొకరితో సహజీవనం, సంతానం, ఆ పై పెళ్లి.. తరహాలో.. పవన్ కల్యాణ్ రాజకీయం కూడా కాషాయం, ఎరుపు, పసుపు రంగుల మధ్యన గత్తరగత్తరగా సాగుతూ ఉంది!