క్రితం సారి ఇండియాలో ఇంగ్లండ్ జట్టు పర్యటించినప్పుడు మోడీ స్టేడియంలో పిచ్ లను చూసి భారతీయ క్రికెట్ అభిమానులు కూడా నివ్వెరపోయారు! టెస్ట్ క్రికెట్ ను చంపడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఆ మ్యాచ్ లు జరిగాయి! ఆ తీరును కూడా కొందరు భారత క్రికెట్ వీరాభిమానులు సమర్థించారు!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లలో సీమర్లకు అనుకూలించే పిచ్ లు లేవా.. అంటూ నిగ్గదీశారు! అది ఏ దేశంలో అయినా సరే.. మ్యాచ్ కనీసం నాలుగు రోజులైనా సాగేలా పిచ్ లు ఉంటే.. చూసే వాళ్లకు కాస్త ఆసక్తి ఉంటుంది, అలా కాకుండా యాభై ఓవర్ల పాటు కూడా ఏ జట్టూ బ్యాటింగ్ చేయలేకపోతే అదేం జెంటల్మన్ గేమ్ అవుతుంది? అనేది ప్రశ్న! ఇటీవల ఇండియా జట్టు సౌతాఫ్రికాలో పర్యటించినప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ జరిగిన పిచ్ కూడా అత్యంత దారుణం గా నిలిచింది. ఆ సందర్భంగా సౌతాఫ్రికాపై విమర్శలు చెలరేగాయి.
మరి అలాంటి విమర్శలన్నింటికీ హైదరాబాద్, వైజాగ్ పిచ్ లు అతీతంగా నిలుస్తున్నాయి! హైదరాబాద్ లో ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండే నెగ్గి ఉండొచ్చు. అయినప్పటికీ.. రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ క్యూరేటర్లను మెచ్చుకుని తీరాల్సిందే! అలాగే వైజాగ్ పిచ్ కూడా స్పిన్నర్లకో, బ్యాటర్లకో స్వర్గధామంగా నిలవలేదు!
ఓపికగా ఆడే బ్యాట్స్ మన్లకు హైదరాబాద్, వైజాగ్ పిచ్ లు స్వర్గధామంగా నిలిచాయి. సిసలైన టెస్ట్ క్రికెట్ ఆడగల సమర్థులకు ఈ పిచ్ లు కలిసొచ్చాయి. ఈ స్కిల్స్ ఉన్న బ్యాటర్లు ఈ పిచ్ లపై తమ సత్తా చూపించారు. స్వదేశంలో టీమిండియా గెలిచే టెస్టుల్లో వికెట్లన్నింటినీ స్పిన్నర్లే తమ ఖాతాలోకి వేసుకోవడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం!
వైజాగ్ టెస్ట్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా తన సత్తా చూపించాడు. గతంలో నాగ్ పూర్ పిచ్ టెస్ట్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని పేరుండేది. భారత పేసర్లు ఎంతసేపూ ఆస్ట్రేలియాలో సత్తా చూపించాలి లేదా ఇంగ్లండ్, సౌతాఫ్రికాల్లో వికెట్లు తీసి జట్టు విజయ బాధ్యతలు మోయాలి తప్ప.. ఇండియాలో అయితే అశ్విన్- జడేజాలే చూసుకుంటారంతా అనే పరిస్థితి ఉన్న సమయంలో వైజాగ్ స్పోర్టివ్ పిచ్ ఇండియాకు సగర్వమైన విజయాన్ని ఇచ్చింది.
హైదరాబాద్ లో కూడా కాస్త శ్రద్ధగా ఆడి ఉంటే విజయం దక్కేది. ఆ శ్రద్ధ కనీసం వైజాగ్ లో చూపించి టీమిండియా విజయం సాధించింది. ఇరు జట్లకూ సమానావకాశాలు ఉంటాయనే పిచ్ లపై మ్యాచ్ లు జరిగితే వీక్షకాదరణ కూడా ఎంతో కొంత పెరుగుతుంది కానీ, రెండో రోజే ఫలితం వచ్చే టెస్టుల్లో గెలిచేసి అదే సత్తా అనుకుంటే దాన్ని వల్ల ఏ జట్టు అయినా తనను తాను మోసం చేసుకోవడమే అవుతుంది!