Advertisement

Advertisement


Home > Politics - Opinion

అమెరికాని అలా వదిలేయకండ్రా! ఎవరికన్నా చూపించండ్రా!

అమెరికాని అలా వదిలేయకండ్రా! ఎవరికన్నా చూపించండ్రా!

పోయిన ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన "డంకీ" సినిమా వచ్చింది. ఉన్న దేశంలో తమ కోరికలకి, అవసరాలకి తగినంత సంపాదించే అవకాశం లేదని పంజాబ్ నుంచి ఇల్లీగల్ గా డొంక దారిలో బ్రిటన్ కి పయనమైన ఒక పల్లెవాసుల కష్టాల కథ ఆ సినిమా. చేసేదే తప్పుడు పని. కానీ దాంట్లో కూడా సింపతీని పండించే హైరాన పడ్డాడు దర్శకుడు హిరానీ. 

ఈ డంకీ మార్గంలో అమెరికాలో చొరబడే వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఎక్కువగా పొరుగుదేశం మెక్సికో నుంచి అమెరికాలో ఊడిపడుతుంటారు అధికశాతం శరణార్ధులు, ఇలీగల్ మైగ్రెంట్స్. మెక్సికోకి, అమెరికాకి మధ్యన పెద్ద గోడ కూడా ఉంది. అయినప్పటికీ దానిని కూడా దూకి మెరుగైన జీవితం కోసం కలలు గంటూ అమెరికాలో చొరబడుతున్నవాళ్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. 

పైగా ఈ మధ్యన అమెరికా విధానాలు చూస్తే "వాళ్లనలా వదిలేయకండ్రా. ఎవరికన్నా చూపించండ్రా బాబు" అని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో రావు రమేష్ లా అనాలనిపిస్తుంది. ఆ విధానాలేంటో చూద్దాం. 

టెక్సాస్ రాష్ట్రం మెక్సికోకి బార్డర్. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ని శరణార్ధులుగా గుర్తించే ప్రసక్తే లేదంటూ పరిస్థితుల్ని కట్టుదిట్టం చేసింది ఆ రాష్ట్రం. కానీ అదేంటో డెమోక్రటిక్ పార్టీ ఆధీనంలో ఉన్న కొలరాడో రాష్ట్రం మాత్రం టెక్సాసుకి కాకపోతే మా వద్దకు రండి మేం గుర్తిస్తామంటోంది. ఇదెక్కడి గోల? రెండు రాష్ట్రాలూ ఒక దేశంలోనే ఉన్నా ఈ అంతర్జాతీయ అంశంలో వీళ్ల పెత్తనాలేంటో అర్ధం కాదు. ఇంతకీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన దేశాధ్యక్షుడు బైడెన్ ఇది ఫెడెరల్ నిర్ణయమని..రాష్ట్రాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కొలరాడోని కాకుండా టెక్సాస్ ని మందలించాడు. 

ఈ శరణార్ధులు ఒక్క మెక్సికో నుంచే కాదు..వెనెజులా వంటి ఇతర వెనకబడ్డ దేశాల నుంచి కూడా వస్తున్నారు. తాజాగా డెనవర్ లో బ్రిడ్జిల క్రింద టెంటులేసుకుని బతుకుతున్న వీళ్లు తాము చలికి తట్టుకోలేకపోతున్నామని ఇళ్లు ఇవ్వమని అడుగుతున్నారు. కొందరైతే తమకి ఉద్యోగాలు కల్పించమని రిక్వెస్ట్ లాంటి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల వీళ్లంతా ఒక గ్రూపుగా మారి తమని ఒక కమ్యూనిటీగా గుర్తించమంటున్నారు. శరణంటూ వచ్చి హక్కులు మాట్లాడుతున్నవారు కూడా బోలెడంత మంది ఉన్నారు. వీళ్లందర్నీ పోషించడానికి ట్యాక్స్ పేయర్స్ మనీయే ఖర్చు చెయ్యాలి. 

ఇప్పటికే అమెరికా ఆర్ధికసంక్షోభం మామూలుగా లేదు. పైకి డాలర్ విలవ ఒక్కటీ కనిపిస్తోంది కనుక లోపలి డొల్లతనం తెలియట్లేదంతే. ప్రపంచంలో ఏ దేశం సంక్షోభంలో ఉన్న ఆయా దేశాలకి తగుదునమ్మా అని పెద్దనయ్య పొజిషన్లో సైన్యాన్ని పంపి దేశ ఖజానా మీద పెద్ద బరువేసుకుని కూర్చుంది అమెరికా. ఆ మిలిటరీ చర్యలకి బోలెడంత అప్పు కూడా చేసింది కూడా. 

దానిపైన కరోనా సంక్షోభం...బ్యాంకింగ్ వ్యవస్థల్లో లోపాల వల్ల అవి కొన్ని కుప్పకూలడం, ఎక్కడ చూసినా అధికధరలు, ఆపైన గంజాయి లీగలైజ్ అవడం, గన్ కల్చర్ వల్ల జనం ప్రాణాలు కోల్పోవడం...ఇన్నేసి రోగాలతో మూలుగుతున్న అమెరికాకి ఈ ఇల్లీగల్ వలసదారులు అవసరమా? 

తాజాగా కొందరు అక్రమ వలసదారులు పోలీసులపై దాడి చేసారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. రాను రాను పరిస్థితి ఇంకా దిగజారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 

ఈ విషయంపై స్పందిస్తూ ఎలాన్ మస్క్ కూడా సోషల్ మీడియాలో తన బాధని వ్యక్తపరిచాడు. అసలు అమెరికా ఎటు పోతోందో అని వాపోయాడు. 

అమెరికాలోకి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్లకి బ్యాంక్ లోన్లు, అప్పులు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఉచిత వైద్యం, ఇన్-స్టేట్ కాలేజీ విద్య ..ఇలా అన్ని లభిస్తున్నాయని; ఇక వీళ్లకి వేలాది డాలర్లు ట్యాక్సులు కట్టే ఇతర లీగల్ ఇమిగ్రెంట్స్ కి తేడా ఏంటని ప్రశ్నించాడు. 

ఇది నిజంగా దారుణం. డొంక దారిలో అమెరికాలోకి దూరి ఏడుపుగొట్టు మొహం వేసుకుని కష్టాలు చెప్పుకుంటే పేరొందిన యూనివెర్సిటీల్లో దాదాపు ఉచిత విద్య లభిస్తోంది వీ వలసదారులకి. అదే రాచమార్గంలో వీసా మీద దేశానికి వచ్చి సంపాదించి ట్యాక్సులు కట్టే వాళ్లకి మాత్రం అది చాలా ఖరీదైన వ్యవహారం. 

ఇలా గుంపులు గుంపులుగా వచ్చే అక్రమ వలసదారులు ఇల్లు కావాలని డిమాండ్ చేయడం వంటి కారణాల వల్ల ఇళ్ల రేట్లు, రెంటులు కూడా పెరిగిపోయాయని చెబుతున్నాడు మస్క్. 

అంతే కాదు..సక్రమ వలసదారులైన ఒక జంట హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట చచ్చినట్టు నెలకి 2000 డాలర్స్ కట్టాలి. కానీ అక్రమవలసదారులు ఏమీ కట్టకపోయినా ఉచిత వైద్యం. ఇదెక్కడి న్యాయం? అసలీ అక్రమ వలసదారుల్ని ఎందుకు రానీయాలి? ఈ ప్రశ్నలు అమెరికా జనాభా మొత్తాన్ని డొలిచేస్తున్నాయి. 

ఎప్పటి నుంచో హెచ్1బి వీసాల ద్వారా క్వాలిఫైడ్ లేబర్ ని తమ దేశంలోకి రప్పించుకోవడం తప్ప బ్లూ కాలర్ జాబ్స్ కోసం తగిన వీసా పెట్టి కార్పెంటర్లకి, ప్లంబర్లకి, బార్బర్లకి, కూలీలకి ఎందుకు రాజమార్గంలో వచ్చే వెసులుబాటు కల్పించలేదో! ఎలాగో పక్క దేశాల నుంచి గోడ దూకి వస్తున్నారు కాబట్టి వాళ్లని వాడుకోవచ్చులే అనుకుంటున్నారా పాలకులు? అదేం లెక్క? 

దేశంలో ఎంత సంపాదిస్తున్న ఉద్యోగులైనా ఎవరి కారు వారు నడుపుకోవడం, ఎవరి ఇల్లు వాళ్లు తుడుచుకోవడం, ఎవరి కూలిపని వాళ్లు చేసుకోవడంలా ఉంది ఎప్పటినుంచో. పేరుకే సంపన్నదేశం. కానీ సంపన్నులుగా బతికేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో అయితే సగటు మధ్యతరగతి ఇంట్లో కూడా పనిమనుషులుంటారు. ఏ రిపేర్ వచ్చినా చేయడానికి ఎలెక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్ పిలిస్తే పలుకుతారు. కాస్త ఎగువ మధ్యతరగతి అయితే చాలు..కారు నడపడానికి డ్రైవర్లు, ఇంట్లో వంట మనుషులు కూడా ఉంటున్నారు. ఈ హోదా అమెరికాలో ఎంతమంది డాక్టర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకుంది? పనివాళ్లని, డ్రైవర్లని పెట్టుకోవాలనుకున్నా ఖరీదెక్కువ. ఆ పరిస్థితి కల్పించిందెవరంటే పాలకులు, వీసా విధానాలే. 

అలా కాకుండా పైన చెప్పినట్టు గోడ దూకే అవసరం లేకుండా రాజమార్గంలో బ్లూ కాలర్ జాబ్స్ కోసం తలుపులు తెరిచుంటే దేశం చాలా పద్ధతిగా ఉండుండేది. 

ఇంతే కాదు...ఒకప్పటి అమెరికాకి, ఇప్పటి అమెరికాకి చాలా తేడా ఉంది. పద్ధతిగా కాకుండా గోడ దూకి డంకీ మార్గంలో వచ్చే వలసదారులు పబ్లిక్ గా మల- మూత్రవిసర్జన చేయడం వంటి చర్యలకు పాల్పడి ఒక అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీళ్లల్లొ కొంతమంది నేరాలకి పాల్పడుతున్నారు. గంజాయే కాకుండా ఇతర నిషేధిత డ్రగ్స్ అమ్మడం వంటివి చేస్తున్నారు. 

అసలేం సాధిద్దామని పాలకులు వలసశరణార్ధుల పట్ల ఈ ఉదాసీన ధోరణి అవలంబిస్తున్నారో తెలీయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య, భద్రత పరిస్థితులు మరింత అతలాకుతలమయ్యే ప్రమాదం లేకపోలేదు. 

అత్యంత కట్టుదిట్టమైన దేశంగా పేరున్న అగ్రరాజ్యం అమెరికా ఈ విధమైన విధానాలతో దేశాన్ని దిగజారుస్తుంటే అనాలనిపిస్తుంది కదా..."వాళ్లనలా వదిలేయకండ్రా. ఎవరికన్నా చూపించండ్రా బాబు" అని!!!

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?