విలువలతో కూడిన రాజకీయం చేస్తాం. ఫిరాయింపు దారులను ఎంకరేజ్ చేయము అంటూ చెప్పుకువచ్చిన జనసేన అధిపతి ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నారు. వివిధ పార్టీల గుమ్మాలు అన్నీ ఎక్కి దిగి వచ్చిన వారిని ఎంచి సీట్లు ఇవ్వబోతున్నారు.
విశాఖ జనసేన అంటే గుర్తుకు వచ్చే పేరు శివశంకర్. చాలా అంటే చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్నారు. కానీ పవన్ దృష్టిలో ఆయన లేరు. ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం మీదుగా, వైకాపాలోంచి వచ్చిన పంచకర్ల రమేష్ బాబు ను నిలబెట్టాలనుకుంటున్నారు పెందుర్తి నియోజకవర్గంలో. అలాగే పార్టీలు మారి, వైకాపాలో ఎమ్మెల్సీ పదవి అనుభవించి వచ్చిన వంశీ యాదవ్ ను టికెట్ కు దగ్గర చేయాలనుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు అంటే మండి పడుతూనే అతని సమీప బంధువుకు అనకాపల్లి టికెట్ ఇప్పించాలనుకుంటున్నారు. పంచకర్ల కూడా గంటాకు బాగా సన్నిహితుడు.
బాలశౌరిని తీసుకువచ్చారు. ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా సాధ్యమేనా? ఎల్లో మీడియా అవినీతి ముద్రలు వేసిన వాళ్లను తమ పార్టీలోకి తీసుకుంటూ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు పవన్. రేపు అదే ఎల్లో మీడియా వీళ్ల గురించి ఏం రాస్తుంది? అలాగే ఈ మధ్య చాలా మందిని శాలువాలు కప్పి పక్క పార్టీల్లోంచి ఆహ్వానించారు. వీరిలో కొంతమందిని చంద్రబాబే పంపుతున్నారని విమర్శలు లేదా ఆరోపణలు లేదా కామెంట్లు వున్నాయి. మరి వారందరికీ టికెట్ ఇవ్వాల్సి వుంటుంది.
మరోపక్క పవన్ డబ్బులు చూసి టికెట్ లకు ఎంపిక చేసే పని పెట్టుకున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కాకినాడ రూరల్ నానాజీ కి టికెట్ అని రెండేళ్ల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన దగ్గర తగిన ఆర్థిక స్తోమతు లేదని పవన్ సందేహిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే సరి కాదు కదా?
తెలంగాణలో పార్టీ తరపున పోటీ పెట్టినపుడు రాత్రికి రాత్రికి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇచ్చి, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని ఎక్కడో పరిచయం లేని సుదూర దూరం పంపారు. ఇదే స్కీము ఇప్పుడు ఆంధ్రలో కూడా అమలు చేస్తే నమ్ముకున్న పరిస్జితి ఏమిటి?
32 సీట్లు పవన్ అడుగుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. వాటిల్లో పవన్ కు, నాగేంద్ర బాబు కు, మనోహర్ కే మూడు సీట్లు పోతాయి. ఇలా పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ఎన్ని, చిరకాలంగా పార్టీని నమ్ముకున్నవారికి ఎన్ని?
మరి జనసేనను మొదటి నుంచీ నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి?
ఇవేనా విలువలతో కూడిన రాజకీయాలు.