విశాఖను ఆర్ధిక రాజధానిని చేస్తాను అని ఉమ్మడి విశాఖ జిల్లాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు జనాల ముందు ఆర్భాటంగా ప్రకటించారు. ఆర్ధిక రాజధాని అంటే ఏమిటి అన్నది జనం ఎప్పుడూ అడగరు, అదొక బ్రహ్మ పదార్ధంగా ఉంటుంది. అంతకు మించి అతి గంభీరమైన పదం గానూ ఉంటుంది.
ఇంతటి బరువైన పదం వాడారు అంటే మన విశాఖ ఘన విశాఖ అవుతుంది కదా అని అనుకున్న బాపతు కూడా ఉంటారు అన్నదే టీడీపీ ప్రగాఢ విశ్వాసం. అమరావతి మన రాజధాని అంటూ విశాఖ మన ఆర్థిక రాజధాని అని బాబు క్యాచీగా డైలాగులు చెబుతున్నారు.
వైసీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని అంది కదా దాన్ని అడ్డుకుని న్యాయ స్థానాల్లో ఇబ్బందులు లెక్కలేనన్ని పెట్టి అసలు రాజధానిని అటకెక్కించి ఈ కొసరు ఆర్థిక రాజధాని ఏంటి బాబూ అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పోనీ ఆర్ధిక రాజధాని అంటే అది ముంబై మాదిరిగా ఉండొచ్చా అంటే ఏమో ఎవరి ఊహలకు వారే సమాధానం చెప్పుకోవాలి. టీడీపీ ఏమీ కొత్తగా పుట్టిన పార్టీ కాదు, ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు పాలించారు. అలాగే విభజన ఏపీలో అయిదేళ్ళు సీఎం గా ఉన్నారు. అనాడు విశాఖ ఆర్థిక రాజధాని ఎందుకు కాలేకపోయింది అన్నది వైసీపీ నేతల సహా సగటు జనాల ప్రశ్న.
అమరావతిని రాజధాని ఎటూ చేస్తున్నారు, అది టీడీపీ విధానం కాబట్టి విశాఖకు కూడా ఒక ట్యాగ్ తగిలించాలని ఆర్ధిక రాజధాని అంటున్నారు కానీ విశాఖను ఆ దిశగా నడిపించిన చరిత్ర ఉందా అని నిలదీస్తున్నారు. ఎయిమ్స్ వంటి సంస్థను విశాఖలో ఎందుకు పెట్టలేదు అంటే టీడీపీ వద్ద జవాబు ఉందా అని అడుగుతున్నారు.
రైల్వే జోన్ ని విజయవాడలో ఏర్పాటు చేయాలని టీడీపీ ఏలుబడిలో ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేసిన సంగతినీ గుర్తు చేసుకుంటున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ కి నాడు అతీ గతీ లేదు అన్న విమర్శలు ఉన్నాయి.
విశాఖలో టూరిజం ప్రాజెక్టులు కానీ సినీ రాజధాని కానీ ఎక్కడైనా ముందుకు పోయిందా అన్నది కీలకమైన ప్రశ్నగా ఉంది. విశాఖలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉంటే ఎంతో కొంత ఆర్ధికంగా ఊతం వచ్చేది. కానీ నవ నగరాలు పేరుతో అమరావతి రాజధానిని డిజైన్ చేసే శ్రద్ధ గత అయిదేళ్ళలో విశాఖ మీద లేకపోయే.
ఇప్పుడు ఎన్నికల వేళ విశాఖను ఆర్ధిక రాజధాని అంటే పరిపాలన రాజధాని కంటే ఎక్కువే అనుకునే జనాలు కూడా ఉంటారని టీడీపీ ధీమా అయితే చేసేది ఏమీ లేదు. విశాఖ ఎవరు కాదన్నా ఏపీలో మెగా సిటీ. అమరావతి కలల రాజధానిగానే ఇంకా శైశవ దశ కూడా దాటని పరిస్థితి.
వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన నచ్చకపోతే విశాఖనే ఏకైక రాజధాని చేస్తామని విశాఖలో రెడీమేడ్ గా ఉన్న సదుపాయాలు వాడుకుని రానున్న అయిదేళ్లలో ఏపీలో సంపద సృష్టించి మొత్తం అయిదు కోట్ల జనాభాకు దాన్ని పంచుతామని టీడీపీ చెప్పవచ్చు కదా అన్నది మేధావుల నుంచి సూటిగా వస్తున్న ప్రశ్నలు. అర్ధం కానీ ఆర్ధిక రాజధానుల ట్యాగులు కల్చరల్ క్యాపిటల్ కితాబులు దశాబ్దాల క్రితమే విశాఖ చూసేసిందని సెటైర్లు అయితే పడుతున్నాయి.