టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా అంటూ సభలు పెడుతున్నారు. జనవరిలో సభలు పెట్టారు, మలి విడత అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులతో మొదలెట్టారు. ఈ సభలలో బాబు చెప్పేది పొంతన లేని మాటలు అని విమర్శలు వస్తున్నాయి.
మాట్లాడితే జగన్ మీద విమర్శలతోనే చంద్రబాబు ఈ సభలలోనే హోరెత్తించేస్తున్నారు. ఎన్నికల వేళ అధికార పార్టీని విమర్శించాల్సిందే. అయితే అందులో తర్కం ఎంత అన్నది అంతా చూస్తారు గమనిస్తారు. అదే సమయంలో చంద్రబాబు చెబుతున్న పొంతన లేని మాటలు కూడా అంతా వింటున్నారు.
ఏపీ సర్వనాశనం అయిపోయింది జగన్ పన్నెండు లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు చేసి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు అని చంద్రబాబు అంటున్నారు. ఏపీని తిరిగి నిర్మించుకోవాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇటుక ఇటుక తెచ్చి పేర్చితేనే తప్ప ఏపీ అభివృద్ధి చెందదు అని ఆయన ఘంటాపధంగా చెప్పేస్తున్నారు.
అదే నోటితో ఆల్ ఫ్రీ హామీలు ఇస్తున్నారు. ఒక వైపు ఏపీని జగన్ అమ్మేశారు అని ఆవేదన ఆందోళన వినిపిస్తూ అదే గొంతుకతో ఆల్ ఫ్రీ అంటున్న బాబు తీరు గురించే అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీ ఇచ్చిన హామీల కోసమే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ కంటే రెట్టింపు అని బస్తీ మే సవాల్ చేస్తూ చంద్రబాబు ఉచితాల మీద జనాలను ఊదరగొడుతున్నారు.
తల్లికి వందనం అంటూ ఒక కుటుంబంలో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ ఏడాదికి పదిహేను వందల రూపాయలు ఇస్తామని భారీ హామీ గుప్పించేశారు. నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు పదిహేను వేల రూపాయలు అంటున్నారు. మహిళల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఫ్రీ అని మరో హామీ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సదుపాయం ఇస్తామని చెబుతున్నారు. రైతులకు ఏడాదికి ఇరవై వేల ఆర్ధిక సాయం ఇస్తామని పేదలందరికీ ఇళ్ళూ ఇంటికే ఒక్కటో తేదీన పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ఊదరగొడుతున్నారు.
ఇన్నేసి పధకాలకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయో బాబు చెప్పాల్సి ఉంది కదా అంటున్నారు. ఏపీ అప్పుల కుప్ప అన్నది బాబు చెబుతున్న విషయమే. ఈ అప్పులు తీర్చాలీ అంటే ఉచితాలను స్వస్తి చెబుతామని ఏపీ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెడతామని బాబు లాంటి సీనియర్ రాజకీయ నేత చెబితే అందులో అర్ధం ఉంటుంది అని అంటున్నారు.
అలా కాకుండా ఏపీలో అంతా అస్తవ్యస్తం అయింది అని చెబుతూనే ఉచితాలు పేరుతో జనాలకు హామీలు ఇస్తూ పోతున్న బాబుకు ఉన్న నమ్మకం ఏంటి అన్న పశ్న వస్తోంది. దానికి టీడీపీ వద్ద ఒక పర్మనెంట్ మంత్రం ఉంది. సంపదను బాబు సృష్టిస్తారు అని. ఆయన గత అయిదేళ్లలో ఎంత సంపద సృష్టించారు అన్నది కూడా వెంటనే ప్రశ్న వస్తుంది.
సంపద సృష్టించడం ప్రతీ నెలా పధకాలు పంచినంత సులువు కాదని తెలియదా అని కూడా అంటున్నారు. ఏపీలో బాబు ఇస్తున్న హామీలు చూస్తే జగన్ సంక్షేమానికి పెడుతున్న లక్ష కోట్ల కంటే మరో లక్ష కోట్లు అదనం అవుతుంది అని అంటున్నారు. ఏపీని ఆదుకోవడం బాగు చేయడం అంటే జగన్ పధకాల కంటే రెట్టింపు చేయడమేనా అన్న ప్రశ్న వస్తే టీడీపీకి అదే ఇబ్బందే అవుతుంది.
ఇవన్నీ ఎందుకు కానీ తాను సంస్కరణవాదిని అని 1995 తరువాత చెప్పుకున్న బాబు ఇపుడు అదే మంత్రంతో ఎన్నికలకు వెళ్తే ఆయన్ని అభిమానించే సెక్షన్ల మద్దతు అయినా దక్కుతుంది అంటున్నారు.