ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీని వీడేందుకు నిర్ణయించారు. మైలవరం సమన్వయకర్తగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని వైసీపీ నియమించిన సంగతి తెలిసిందే. వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడుతారనే నిర్ణయానికి వచ్చిన అధికార పార్టీ, మైలవరంలో ఎమ్మెల్యే కదలికలపై దృష్టి సారించింది. వసంత కృష్ణప్రసాద్ వెంట నడుస్తారనే అనుమానంతో నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలపై అధికార పార్టీ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో తన అనుచరులతో వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశ ప్లెక్సీలో ఎన్టీఆర్‌తో పాటు వైఎస్సార్ ఫొటోలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇంకా టీడీపీలో చేరకపోవడంతో చంద్రబాబునాయుడు, లోకేశ్ ఫొటోలను పెట్టలేదనే చర్చకు తెరలేచింది.
వైఎస్సార్ ఫొటో పెట్టడం ద్వారా వైసీపీ శ్రేణుల్ని వసంత తన వైపు తిప్పుకునే వ్యూహం కనిపిస్తోంది. పలు దఫాలు వసంత కృష్ణప్రసాద్‌తో సీఎం జగన్‌తో పాటు వైసీపీ పెద్దలు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు విభేదాలున్నాయి. తనకు తెలియకుండానే మైలవరంలో అధికారుల నియమకాల్ని చేపట్టారని వసంత గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంవోకు పిలిపించుకుని చర్చలు జరిపి, పార్టీలోనే కొనసాగాలని, మరోసారి మైలవరం నుంచే పోటీ చేయాలని విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదు.
ఒకట్రెండు సార్లు సీఎంవో అధికారులు ఫోన్ చేసి, ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు రావాలని పిలిచినా వసంత ఖాతరు చేయలేదు. మూడోసారి సీఎంవోకు వెళ్లి, నేరుగా జగన్‌తోనే పార్టీ వీడుతున్నట్టు తేల్చి చెప్పారు. దీంతో ఆయన స్థానంలో వైసీపీ కొత్త అభ్యర్థిని నియమించింది.
వైసీపీని వీడుతూ వైఎస్సార్‌ను మాత్రం ఆయన గుర్తు పెట్టుకోవడం గమనార్హం. వైఎస్సార్ అభిమానుల్ని తన వెంట తిప్పుకోవాలనే వసంత ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.