మెగాస్టార్ చిరంజీవికి రెండో పద్మ అవార్డు రావడం, ఆయనకు అభినందనలు, సన్మానాలు జరుగుతుండటం జరుగుతోంది. మంచిదే, పద్మభూషణ్ అవార్డును చాలా కాలం కిందటే పొందిన చిరంజీవి, అందుకు కొనసాగింపుగా పద్మవిభూషణ్ అవార్డును కూడా పొందారు. చిరంజీవి కళారంగంలో సాధించిన ఘనతలకు ఈ అవార్డులు అదనపు ఆభరణాలు!
అర్హత ఉన్న వ్యక్తులకు ఈ అవార్డులు రావడం అభినందనీయమే కానీ, ఇలాంటి సమయంలోనే అర్హత ఉన్నా ఈ అవార్డులను అందుకోని వారెందరో ఉన్నారని గుర్తు చేయాల్సి ఉంటుంది! తెలుగు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులనే పరిగణించినా.. జాతీయ స్థాయిలో ఇలాంటి అవార్డుల్లో వేటినీ అందుకోని గొప్ప నటీనటులు చాలా మంది ఉన్నారు! ఈ జాబితాను ఏకరువు పెట్టడం మొదలుపెడితే చాలా పెద్దదే అవుతుంది!
ఇటీవలే స్వర్గస్తుడు అయిన చంద్రమోహన్ కు ఇలాంటి అవార్డులు ఏవీ దక్కలేదు! ఈ విషయం లో ఆయన తన గురించి కాదు, తన కన్నా ప్రతిభావంతుల్లోచాలామందికి పద్మ అవార్డులేవీ రాలేదనే విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు! తెలుగులో సినీ రంగానికి సంబంధించిన వ్యక్తుల్లో అలాంటి గుర్తింపుకు నోచుకుని వారి జాబితానే ఆయన ఒకసారి చెప్పారు! తనకు రాకపోవడం కాదు, తన కన్నా గొప్ప వాళ్లకే పద్మశ్రీలు, పద్మభూషణ్ లు రాలేదని ఆయన వాపోయారు!
ఇక కేరళ నుంచి మరో మాట వినిపిస్తోంది. కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లలో చాలా సార్లు మమ్ముట్టీ పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేస్తోందట! అయితే ప్రతి సారీ తిరస్కరణే ఎదురవుతోందని అక్కడి వారు అంటున్నారు! గత కొన్నేళ్లలో రజనీకాంత్, చిరంజీవిలకు పద్మవిభూషణ్ అవార్డుల నేపథ్యంలో.. ఈ చర్చ జరుగుతూ ఉంది. కేరళ ప్రభుత్వం సిఫార్సు చేసినా.. కేంద్రం ప్రతిసారీ పద్మ అవార్డును తిరస్కరిస్తోందనే చర్చ అక్కడ సాగుతూ ఉంది. మమ్ముట్టీ కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుడు కావడంతో ఇది జరుగుతోందనే వాదనా వినిపిస్తోంది.
పద్మ అవార్డుల వెనుక లాబీయింగే కాకుండా, కేంద్రంలోని ప్రభుత్వ వ్యూహాలు కూడా ఉంటాయనే వాదన చాలా పాతదే! తమకు ఉపయోగపడతారనుకునే వారికే ఈ అవార్డులను పంచుతుంటారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. నిజంగా అర్హత ఉన్నా.. అవార్డులు పొందిన వారు ఇలాంటి చూపుతోనే చూడబడటంలో పెద్ద ఆశ్చర్యం లేని స్థితిలో ఉంది పరిస్థితి!