Advertisement

Advertisement


Home > Politics - Opinion

టార్గెట్.. వీక్‌పాయింట్!

టార్గెట్.. వీక్‌పాయింట్!

‘సిద్ధం’ అని ప్రకటించి.. తొడకొట్టి.. ఎన్నికల గోదాలోకి దిగేముందు.. బలాన్ని పరీక్షించుకోవడం, బలగాలను పరిశీలించుకోవడం ఎవరైనా చేసే పని! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు.  బలాలను బేరీజు వేసుకుంటున్నారు. పదును పెట్టుకుంటున్నారు. అదంతా సవ్యంగానే ఉంది. మరి బలహీనతలను గుర్తిస్తున్నారా? బలం సరిగ్గా ఉన్నదో అంచనా వేయడం ఘనత కాదు.. బలహీనతలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండడమే విజ్ఞత! అదే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.. బలనహీనతలు తెలుసా?!

Knowledge is knowing of what we don’t know అని ఇంగ్లిషులో ఒక మంచి సామెత ఉంటుంది. జ్ఞానం అంటే.. మనకు ఏది తెలియదో దానిని గురించిన స్పృహ కలిగి ఉండడమే. సార్వజనీనమైన ఈ సిద్ధాంతం కేవలం జ్ఞానం కు మాత్రమే కాదు.. ‘బలం’ కు కూడా వర్తిస్తుంది. మన బలహీనతలు ఏమిటో తెలుసుకుని ఉండడమే బలం అనిపించుకుంటుంది. మరి ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బలంగానే ఉన్నారా? తన బలహీనతలను పూర్తిగా తెలుసుకోగలుగుతున్నారా? అనేది చర్చనీయాంశం.

ఇలాంటి ప్రశ్న సంధిస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవ్వుతారు. ఆయన అభిమానులు దండెత్తుతారు. ముఖ్యమంత్రి చేస్తున్న కసరత్తు మొత్తం కనిపించడం లేదా అని నిలదీస్తారు. అభ్యర్థుల మార్పు చేర్పులు, బదిలీలు ఇలాంటి ఏర్పాట్లు అన్నీ కూడా.. ఆయా అభ్యర్థులు బలహీనులుగా ఉన్నారని గుర్తించబట్టే కదా! అని విశ్లేషిస్తారు. సిటింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉండే వ్యతిరేకత పార్టీకి బలహీనతగా మారుతున్న సంగతిని గుర్తించే కదా.. ఈ మార్పులు చేస్తున్నది అని సమర్థించుకుంటారు. నిజమే కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న బలహీనత అదొక్కటేనా? తతిమ్మా అన్ని రకాలుగానూ వారు చాలా బలంగా ఉన్నారా అనేది కార్యకర్తలకే మెదలుతున్న సందేహం. 

‘సిద్ధం’ అనేశారు గానీ..

‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. ప్రిన్సిపల్ విద్యార్థుల్ని అడుగుతాడు. ‘చంద్రుడిమీద మొట్టమొదటగా దిగిన మనిషి ఎవరు?’ అందరూ పోలోమని సమాధానం చెప్తారు.. ‘నీల్ ఆర్మ్ స్ట్రాంగ్’ అని! ‘రెండోసారి దిగిన వ్యక్తి ఎవరు..’ అని అడుగుతాడు. జవాబు రాదు. గుసగుసలు సాగుతుంటాయి. రెండో వాడిని ప్రపంచం పట్టించుకోదు.. అని చెప్తాడాయన. ఆయన ఫిలాసఫీ కొన్ని విషయాల్లో నిజమే అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల సమరానికి అన్ని పార్టీలూ ఘనంగా తయారవుతుండగా.. వారందరిలోనూ మొట్టమొదటగా ‘సిద్ధం’ అని ప్రకటించినది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఏదో ఆయన మీద పంతానికి పోయి, పవన్ కల్యాణ్ దళాలు ‘మేమూ సిద్ధం’ అని ప్రకటించుకుంటున్నాయి గానీ.. ముందే చెప్పినట్టు రెండోసారి ఆ మాట వాడిన వారిని ప్రజలు పట్టించుకోరు. కానీ, సంసిద్ధత అనేది మాట చెప్పినంత ఈజీ కాదు. అభ్యర్థులను మార్చేసినంత మాత్రాన, అలిగిన వారిని బుజ్జగించడానికి, లొంగకుండా పక్కచూపులు చూస్తున్న వారి స్థానంలో ప్రత్యామ్నాయాలను ఎంపిక చేయానికి అనుచరులను నియమించినంత మాత్రాన, ఊరూరా బహిరంగ సభలను ప్రారంభించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి.. ‘సిద్ధం’ అయినట్టు అనుకోకూడదు.

అందరికీ కనిపించే విధంగానే.. పార్టీ సిద్ధంగా లేని వ్యవహారాలు అనేకం ఉన్నాయి. ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగాల్సి ఉంది. పెండింగులో ఉన్నచోట్ల బుజ్జగింపు పర్వాలు పూర్తి కానేలేదు. ఇప్పుడు మార్పుచేర్పులకు గురైన వారిలో ఎంతమంది పక్కచూపులు చూస్తున్నారో స్పష్టత లేదు. వారందరికీ ప్రత్యామ్నాయాలు రెడీ చేసుకున్నారా అనేది కూడా స్పష్టత లేదు. వీటన్నింటినీ తోసిరాజనుకుంటూ ఆయన ముందుగా తన బలహీనతలను గుర్తించాల్సిన, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు. అధికారాన్ని ఆశిస్తున్న లేదా.. ఏపీ రాజకీయాలను శాసించాలని కలలు కంటున్న నాయకులు అందరూ కూడా ముందుగా తమ తమ బలహీనతలను తెలుసుకోవాలి. అభిమానం, అహం అడ్డు వస్తాయేమో గానీ.. జనం పరిగణనలో ఉన్న వారి బలహీనతలను విడివిడిగా పరిశీలిద్దాం. 

జగన్: ఓట్లున్నాయి.. వేయించేదెవ్వరు?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా సంక్షేమ పథకాలే తన బలం అని నమ్ముకున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా మిస్ కాకుండా అమలు చేస్తున్న పథకాలు తన ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఆయన అనుకుంటున్నారు. చాలా వరకు ఇది నిజం. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. పెన్షను వంటి ఆర్థిక ప్రయోనాలు నేరుగా పేదల ఇళ్లకి ఒకటో తేదీ నాటికి చేరుతూ ఉండడం చాలా గొప్ప పరిణామం. మంచో చెడో వాలంటీర్ల ద్వారా.. పెన్షన్లు వంటివి ప్రజలకు అందడానికి ప్రభుత్వం పడుతున్న కష్టం ప్రజలకు తెలుస్తోంది.

అదే మాదిరిగా.. జగన్ ప్రభుత్వం ఓడిపోతే.. ఈ పథకాల్లో అనేకం ఆగిపోతాయనే ప్రచారం కూడా ప్రజల్లోకి వెళుతోంది. ప్రతిపక్షాలు జగన్ ను వ్యతిరేకిస్తున్న తీరును గమనిస్తే, ఆ ప్రచారం నిజం అని ప్రజలు నమ్ముతున్నారు. ఏతావతా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ కూడా మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి అనుకూలంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ప్రభుత్వం మీద, జగన్ పట్ల ఉండే ప్రజాభిమానాన్ని ఓట్లుగా బదలాయించే వ్యవస్థ ఆ పార్టీకి పటిష్టంగా ఉన్నదా? అదే పెద్ద బలహీనత!

కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకుల విషయంలో వైఎస్సార్ సీపీ బలహీనమైనది కాదు. అయితే వారు పార్టీకోసం పనిచేయడానికి చిత్తశుద్ధితో లేరు. తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉన్నదని మురిసిపోవడమే తప్ప.. ఏ రకంగా కూడా కార్యకర్తల జీవితాలు బాగుపడిన దాఖలాలు లేవు. ఆమేరకు వారు సహేతుకమైన ఆగ్రహంతో ఉన్నారు. కిందిస్థాయి కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉండడం లేదు, నాయకులకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు.. ఇది అలా పైపైకి కొనసాగుతుంది. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు.

క్షేత్రస్థాయి పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం అంటే నాయకులు, ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు. వారు అడిగిన పనులు చేయగల స్థాయి వీరికి ఉండడం లేదు. పార్టీ వారు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటే వాటికి బిల్లులు రావడం లేదు. ఇసుక, మద్యం దందాలు, భూ కబ్జాలు అన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయి నాయకులే స్వయంగా సాగించుకుంటూ.. తాము ఆర్థికంగా బలోపేతం అవుతున్నారే తప్ప.. కింది స్థాయి కార్యకర్తల వరకు వారి బాగును పట్టించుకోవడం లేదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి నాయకుల మీద పార్టీ కార్యకర్తలలో అసహ్యం  పేరుకుపోతోంది. ఇలాంటి నేపథ్యంలో అసహ్యించుకుంటున్న వారిని మార్చి మరొకరిని పోటీకి నిలిపినంత మాత్రాన కార్యకర్తలు అంత ఈజీగా నమ్ముతారా? పార్టీ విజయం కోసం మనస్ఫూర్తిగా కష్టపడేలా నిర్దిష్ట లక్ష్యానికి పునరంకితం కాగలరా? అనేది సందేహం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లున్నాయి. కానీ.. అనేక పొరలుగా బలహీనతలు ఆ ఓట్లకు అడ్డుపడుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తడబాట్లు కూడా పార్టీకి చేటుచేస్తున్న మరో రకం బలహీనత. అభ్యర్థులను ఎడా పెడా మారుస్తున్నారు సరే.. కానీ.. నిర్ణయాత్మకంగా ఉండడం నాయకుడికి అవసరం. జగన్ అలా వ్యవహరించలేకపోతున్నారు. మారుస్తున్న వారిని ప్రకటనకు ముందే అందుకు ఒప్పించడంలో జగన్ విఫలం అవుతున్నారు. అదే జరిగితే.. పార్టీ పరువు తీసేలా ఇన్నేసి తిరుగుబాట్లు ఇవాళ వ్యక్తం అయ్యేవి కాదు. ఏకచ్ఛత్రాధిపత్యంతో పార్టీని నడుపుతున్న నాయకుడు.. ఎందుకు మార్పుచేర్పులకు గురవుతున్న వారిని ముందే ఒప్పించలేకపోతున్నారనేది అర్థంకాని ప్రశ్న.

అలాగే ఆయన వ్యూహాలు కొన్ని అగమ్యగోచరంగా సాగుతున్నాయి. ఎక్కడి నుంచి అందుతున్నాయో గానీ.. సలహాలు ప్రభుత్వాన్ని గాడి తప్పిస్తున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా అర్బన్ ఓటర్ ను దూరం చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. ఆ వర్గాన్ని తిరిగి దరికి చేర్చుకోవడం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారు సంతృప్తి చెందగల పాలన మీద దృష్టి కేంద్రీకరించడం లేదు. సమయం మించిపోలేదు. అధికారంచేతిలో ఉంది.. ఎన్నికల ఆంక్షలు రావడానికి ఇంకా వ్యవధి ఉంది. ఈలోగా బోలెడంత కసరత్తు చేయవచ్చు. 

చంద్రబాబు: కార్యకర్తలున్నారు.. నమ్మేదెవ్వరు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుది ఇంకా చిత్రమైన పరిస్థితి. ఆ పార్టీకి రాష్ట్రమంతా కార్యకర్తల బలం ఘోరంగా ఏం మారిపోలేదు. పార్టీ కోసం పనిచేసే మనుషులు ఉన్నారు. అయితే, ఇక్కడ ఆ కార్యకర్తల చిత్తశుద్ధి కాదు సమస్య! పార్టీ అధినేత చిత్తశుద్ధి, నిజాయితీ మీదనే వారికి నమ్మకం లేదు. ఒంటరిగా వెళితే ఓటమి తప్పదని భయపడుతున్న చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ద్వారా కాపు ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టడానికి స్కెచ్ వేశారు. పవన్ ను ఆయన తన బలంగా భావించుకుంటున్నారు. కానీ ఆయనకు తెలియని సంగతి ఏంటంటే.. అదే ఆయన పార్టీకి బలహీనత అవుతోంది.

పవన్ కల్యాణ్ తో పొత్తు కారణంగా.. ఒకవైపు వైసీపీ ప్రచార పర్వంలో దూసుకెళ్లిపోతుండగా, తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికలో అడుగు ముందుకు వేయకపోవడం కాదు కదా.. కనీసం సీట్లను పంచుకోవడం కూడా చేతకాక చేష్టలుడిగి చూస్తోంది. పవన్ కల్యాణ్.. చంద్రబాబు పల్లకీ మోయడానికి తనకు తోడుగా మోడీని తెచ్చుకోడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారే తప్ప.. ముందుగా సీట్లు పంచుకుని.. అభ్యర్థుల్ని ఎంచుకుని, వారిని సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. పవన్ తో పెట్టుకున్నందున ఆ అలసత్వం తెలుగుదేశానికి  పెద్ద బలహీనత అవుతోంది.

తాము ఎంత కష్టపడి పనిచేసినా.. చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా తమ సీట్లను పవన్ చేతిలో పెట్టేస్తారనే అపనమ్మకం పార్టీ వారిలో ఉంది. అందుకే అందరూ కాడి పక్కన పారేసి కూర్చున్నారు. ఎవ్వరూ కష్టపడి పనిచేయడం లేదు.

చంద్రబాబునాయుడు పచ్చ మీడియా తన బలం అని అనుకుంటున్నారు గానీ.. వారు చేస్తున్న అతి.. ఆయనను, తెదేపాను భ్రష్టుపట్టిస్తోంది. జగన్ సర్కారు ఏం పనిచేస్తోందన్నది.. ఎవరు చెప్పినా చెప్పకపోయినా క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు చూస్తున్న ప్రజలకు తెలుసు. పచ్చమీడియా అదేపనిగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రజలందరూ పార్టీని అసహ్యించుకుంటున్నారు.

చినబాబు నారా లోకేష్ అసమర్థత అనేది చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న పెద్ద బలహీనత. చంద్రబాబునాయుడు తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటి? అనే విషయంలో సీనియర్ నాయకులందరూ అగమ్యగోచరంగా ఉన్నారు. లోకేష్ చేతగానితనం వల్ల పార్టీ మునుగుతందని అందరికీ ఒక నమ్మకం. చంద్రబాబు.. ఎన్ని జాకీలు వేసి లేపుతున్నప్పటికీ.. కొడుకును సమర్థుడిగా నిరూపించలేకపోతున్నారు.

పైగా చంద్రబాబునాయుడుకు ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఏదో అనుభవం ఉన్న నాయకుడు కదాని రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పాలన అధికారం అప్పగిస్తే.. ఆయన చేసిన మాయ, వంచన, గారడీ పనులను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ‘లాస్ట్ చాన్స్’ అంటూ దేబిరించినంత మాత్రాన.. ప్రజల్లో నమ్మకాన్ని నింపలేకపోవడమే ఆయన ప్రధాన బలహీనత. 

పవన్ కల్యాణ్: అజ్ఞానంతో పరువు నష్టం!

పవన్ కల్యాణ్ కు ఉన్న జ్ఞానం తక్కువ. పుక్కిట పట్టిన మాటలతో ప్రసంగాలు వల్లించినట్టుగానే ఆయన సమస్త రాజకీయ వ్యవహారాలను నడిపించవచ్చుననే భ్రమలో ఉన్నారు. సినిమాటిగ్గా ఆవేశపూరిత ప్రసంగాలు రాజకీయాలకు చాలునని అనుకుంటున్నారు. ప్రజల సమస్యల గురించి ఆవేశంగా మాట్లాడేస్తే, ప్రభుత్వం మీద బురద చల్లేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. ఇలాంటి అజ్ఞానం, అందులోంచి బయటపడిపోయే ఆవేశమే ఆయన బలహీనత.

పవన్ కల్యాణ్ చీటికీ మాటికి కులాల ప్రస్తావన తెస్తుంటారు. కులాల మాటెత్తకుండా, అనేకానేక కులాల పేర్లను జాబితాలాగా చదవకుండా.. ఆయన ప్రసంగం పూర్తికాదు. ప్రభుత్వం ఏర్పాటు సెటప్ మీద కనీస జ్ఞానం లేని నాయకుడిలాగా.. ఆయన, ఆ కులాలన్నింటికీ రాజ్యాధికారం ఇచ్చేస్తా అని అంటారు. అంటే ఏమిటో బహుశా ఆయనకు కూడా తెలియదు. పవన్ కల్యాణ్ చరిష్మా కలిగిన నాయకుడు అని నమ్ముకుని.. నాలుగేళ్లుగా ఆయన వెంట ఉండి పార్టీకోసం కష్టపడిన అనేకమంది ఆశలకు భంగపాటులాగా.. ఆయన తెలుగుదేశం పల్లకీ మోస్తున్నారు.

తమ కలలకు గండిపడ్డదని, పవన్ మీద రగిలిపోతున్న కార్యకర్తలు, నాయకులు చాలా మందే ఉన్నారు. తెలుగుదేశంతో చిన్న చిన్న అవమానాలు ఎదురైనా సర్దుకుంటూ పోవాలని ఆయన సునాయాసంగా పార్టీ నేతలకు పిలుపు ఇవ్వవచ్చు గానీ.. అంత తేలిగ్గా ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి పార్టీ వారు సిద్ధంగా లేరు. ఇవన్నీ కూడా పవన్ బలహీనతలే!

షర్మిల: అవకాశవాద మాటల గారడీ!

షర్మిలను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా గుర్తించడానికి ఏపీలోని తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులు హేపీగా ఒప్పుకుంటారేమో. కానీ, ఆమె వైఎస్సార్ తనయ గనుక ఆమె మాటలు నమ్మి.. తనయుడు జగన్ సామ్రాజ్యానికి బీటలు కొట్టడానికి ఎగబడి వస్తారా? అనేది మాత్రం సందేహమే. జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పుకున్న నోటితోనే.. ‘జగన్ రెడ్డీ’ అని సంబోధిస్తూ చేస్తున్న విమర్శల్లోని కుత్సితపు బుద్ధులను ప్రజలు గమనిస్తున్నారు. అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లిపోయి.. ‘నేను తెలంగాణ బిడ్డను.. ఈ నేలకే అంకితమవుతా’ వంటి డైలాగులతో అక్కడ రాజకీయం నడపడానికి ప్రయత్నించి.. అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత.. అక్కడ దుకాన్ బంద్ చేసింది షర్మిల.

కాంగ్రెస్ పార్టీ కుట్ర వ్యూహంలో భాగంగా.. తెలియకుండానే తనను తాను బలిపెట్టుకుంటూ వచ్చి ఏపీ పార్టీ సారథ్యం స్వీకరించింది. ఆనాటినుంచి ఇక జగన్ మీద దాడి మొదలెట్టింది. జగన్ మీద అసంతృప్తితో ఉన్న వారిని, ఆయనను తిడుతున్న వారిని అందరినీ పోగు వేస్తున్నది. ఎంత చేసినా.. ఆమె మాటలను అవకాశవాదానికి నిలువెత్తు రూపంగానే ప్రజలు చూస్తున్నారు. ఈ ఎన్నికల సమయానికి కాదు కదా.. రాబోయే రోజుల్లో కూడా ఆమెను, ఆమె మాటలను ప్రజలు ఆమోదిస్తారని అనుకోవడం భ్రమ!

నాయకులు ముందుగా తమ బలహీనతలను తెలుసుకోవాలి. వాటిని దిద్దుకుంటూ ముందడుగు వేయడమే.. వారిని బలోపేతుల్ని చేస్తుంది. బలాల విషయంలో ఏపార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందనేది ప్రధానం కాదు. ఏ పార్టీ తమ బలాన్ని ప్రజాదరణగా మార్చుకుంటుందో, అధికారంలోకి వస్తుందనేదే ముఖ్యం. ఆ విషయం రెండు నెలల్లో తేలుతుంది. అన్ని పార్టీలూ తమ బలహీనతలను నిజాయితీగా ఒప్పుకుని.. దిద్దుకునే ప్రయత్నం చేస్తే గనుక.. భవిష్యత్తును తేల్చే ఎన్నిక రసవత్తరంగా ఉంటుంది. 

.. ఎల్. విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?