రైల్వే జోన్ ఓట్లు ఇస్తుందా?

అరిగిపోయిన రికార్డులుగా కొన్ని నెరవేరని హామీలు ఎపుడూ ఎన్నికలలో ఆయుధాలుగా ఉంటూంటాయి. కొన్ని కావాలనే రాజకీయ పార్టీలు అలా కాలాలను దాటుకుంటూ దాచి ఉంచుతారు. అయోధ్య రామమందిరం ఇష్యూ బీజేపీకి ఆరేడు ఎన్నికల్లో ఊపిరి…

అరిగిపోయిన రికార్డులుగా కొన్ని నెరవేరని హామీలు ఎపుడూ ఎన్నికలలో ఆయుధాలుగా ఉంటూంటాయి. కొన్ని కావాలనే రాజకీయ పార్టీలు అలా కాలాలను దాటుకుంటూ దాచి ఉంచుతారు. అయోధ్య రామమందిరం ఇష్యూ బీజేపీకి ఆరేడు ఎన్నికల్లో ఊపిరి పోసిన సంగతి తెలిసిందే.

ఏపీ విషయానికి వస్తే ఎన్నికల వేళ ప్రత్యేక హోదా అస్త్రాన్ని రాజకీయ పార్టీలు తీస్తాయి. అధికారంలో ఉన్న పార్టీలు కిక్కురుమనవు. విపక్షంలో ఉన్న పార్టీలకు అది బ్రహ్మాస్త్రం అవుతుంది. అలా 2014లో చంద్రబాబుకు పనికి వచ్చింది. 2019లో జగన్ కి అదే వజ్రాయుధం  అయింది. 2024 లో కాంగ్రెస్ పార్టీ అదే అజెండా చేసుకుని ముందుకు వస్తోంది.

దానికి అదనం అన్నట్లుగా విశాఖ రైల్వే జోన్ ఉంది. ఇది విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రభావితం చేస్తుందని విపక్ష రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కొత్తగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యను కేంద్రంలోని బీజేపీ అనుకోని ఆయుధంగా ఇచ్చింది.

ఇపుడు ఉత్తరాంధ్రాలో ఈ మూడు అంశాల మీద విపక్షాలు నమ్మకం ఉంచి అధికార వైసీపీతో రాజకీయ యుద్ధం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన రైల్వే జోన్ తేలేని పాపం వైసీపీది అంటోంది. బీజేపీ అయితే రైల్వే జోన్ నిర్మాణానికి భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఆక్షేపిస్తోంది. భూమి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు ధర్నాలు కూడా చేస్తున్నారు.

దాన్ని ఎన్నికల స్టంట్ అంటూ కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. చేసినదంతా బీజేపీ చేసి ఇపుడు ఏమిటీ ఆందోళనలు, ఎవరిని మభ్యపెట్టడానికి అని నిలదీస్తోంది. టీడీపీ కూడా రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ తోనే వైసీపీనే గద్దిస్తోంది తప్ప బీజేపీని పల్లెత్తు మాట అనడంలేదు. వామపక్షాలు అయితే కుడి ఎడమలు తేడా లేకుండా అన్ని పార్టీలను గట్టిగానే విమర్శిస్తున్నాయి.

వైసీపీ మాత్రం తాము రైల్వే జోన్ కి అవసరం అయిన భూమిని ఏనాడో ఇచ్చేశ్తామని అంటోంది. భూమి ఇవ్వలేదని కేంద్ర రైల్వే మంత్రి అంటే మేమేమి చేయాలని వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. రైల్వే జోన్ చుట్టూ రగులుతున్న రాజకీయం ఏ పార్టీకైనా ఓట్లు కురిపిస్తుందా ప్రజలకు దాని మీద ధ్యాస ఆశ ఉన్నాయా అన్నది ఒక ప్రశ్న.