ఇప్పుడు తాము అధికారంలో లేము గనుక.. పాలన సాగిస్తున్న వారిమీద ఎడాపెడా విమర్శలు చేయడం ఒక్కటే.. తమ లక్ష్యం అన్నట్టుగా గులాబీ దళాలు చెలరేగిపోతూ ఉండడం మనకు సర్వత్రా కనిపిస్తూనే ఉంది. వందరోజుల్లో రేవంత్ సర్కారు కూలిపోతుందని జోస్యం చెప్పేసి గులాబీ నాయకులందరూ అందుకు ఎదురుచూస్తూ కూర్చున్నారు.
ప్రభుత్వం వైపు నుంచి ఏ చిన్న ప్రకటన వచ్చినా, ఏ నిర్ణయం వచ్చినా.. వెంటనే దానిని విమర్శించడానికి దారులు వెతుకుతున్నారు. ఆ నిర్ణయం లోపాలు ఎన్నలేనిది అయితే.. దాన్ని అమలు చేసేదాకా నమ్మలేం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కల్వకుంట్ల కవిత కూడా ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు.
హామీల అమలుకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఏ హోదాతో ఆమెను ప్రభుత్వ కార్యక్రమానికి పిలుస్తున్నారంటూ కవిత ధ్వజమెత్తుతున్నారు. ఏ హోదాతో ప్రియాంక తెలంగాణలో జరిగిన సభలో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇచ్చారు.. అని అప్పట్లో కవిత ఎందుకు అడగలేకపోయారు? అయినా ఏదైనా హామీ అమలుకు అధికార హోదా ఉన్నవారిని మాత్రమే పిలవాలని ఎక్కడైనా రూలుందా? ఒక సామాన్యుడినో, పూర్తిగా బయటి వ్యక్తినో ఆహ్వానించకూడదని ఎవరైనా ఎలా చెప్పగలరు?
ప్రియాంకగాంధీకి అధికార హోదా లేదు గనుక.. ఆమెను ఆహ్వానించడం తగదు అనే విమర్శ ద్వారా.. ఎంతమంది ప్రజల్లో ప్రభుత్వం పట్ల అసహ్యాన్ని పాదుగొల్పగలనని కవిత అనుకుంటున్నారు.. అనేది అర్థం కావడం లేదు. ఆమెను పిలిస్తే నిరసన తెలుపుతారట. ఇంతకంటె చోద్యం ఏంటంటే.. ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుట. ఒక్క రోజు మాత్రమే కలిశారట. ప్రజాదర్బార్ అన్నారు గానీ.. అక్కడకు వెళ్లడం లేదుట. ఆయన పెద్ద యూటర్న్ సీఎం అని ప్రజలు అనుకుంటున్నారట.
రెండు నెలలు నిండని పాలనకే తమ మనసులో ఉన్న మాటలన్నీ ప్రజలకు ఆపాదించి నిందలు వేస్తున్నారు కవిత. ముఖ్యమంత్రి ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతిరోజూ నిర్వహిస్తున్నారా? లేదా? అనేదే విపక్ష నాయకురాలిగా ఆమె గమనించాలి. ప్రజాదర్బార్ ఎలాంటి మంచి పనులు చేస్తున్నదో మీడియాలో వస్తూనే ఉంది. అలాంటివాటి మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కవిత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అని ప్రజలు సందేహిస్తున్నారు.
అయినా, ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహించడమే కాదు కదా.. ఎమ్మెల్యేలకు అస్సలు ఏనాడూ అందుబాటులో ఉండకుండా, మంత్రులకు కూడా ఎన్నడో ఒకసారి తప్ప దర్శనం ఇవ్వకుండా పదేళ్ల ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన కేసీఆర్ కూతురు.. రేవంత్ రెడ్డి.. ప్రతిరోజూ ప్రజాదర్బార్ కు వచ్చి ప్రజలను కలవడం లేదని నిందలు వేయడం ఆమె ఇమేజినే దెబ్బతీసేలా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.