ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తన ప్రభుత్వంలోనే తన పరువు తీసే కోవర్టులు కొలువు తీరితే ఆయన గుర్తించలేకపోతున్నారా? వారిని కట్టడి చేయలేకపోతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
మంత్రివర్గ సమావేశాల్లో జరిగే ఆంతరంగిక సంభాషణలు కూడా రాజకీయ ప్రత్యర్థులకు లీక్ అవుతోంటే.. అలాంటి వ్యవహారాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు తప్ప.. కట్టడి చేయలేకపోతున్నారా? మందలించలేకపోతున్నారా? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. చివరికి తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో- జగన్ ఇదే ఆవేదన వ్యక్తం చేయడం.. ‘ఇక్కడ మాట్లాడడం వద్దు.. ఇంటికి రండి మాట్లాడుకుందాం’ అని చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది.
జగన్ చుట్టూ ఏం జరుగుతోందో.. ఏం చర్చలు సాగుతున్నాయో.. ఆయన నిర్ణయాల పట్ల అనుచరుల్లో, సచివుల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయో, ఆయన పట్ల భిన్నాభిప్రాయాలు ఎవరైనా వెలిబుచ్చుతున్నారో లేదో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులు కాపుకాసి ఉంటారు.
ఇక్కడ పెద్ద ప్రమాదం ఏంటంటే.. ప్రతిపక్షం తెలుగుదేశానికి కొమ్ముకాసే అనుకూల అగ్ర మీడియా సంస్థలు రెండు ప్రబలంగా ఉండడం. స్పష్టంగా తమ పార్టీకి చేటుచేసే పత్రికలే అని తెలిసినప్పటికీ.. రకరకాల అసవరాల రీత్యా రాజకీయ నాయకులు వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో కొందరు మంత్రులు.. మంత్రి వర్గ సమావేశాల్లో జరిగే ఆఫ్ ది రికార్డ్ చర్చలను కూడా లీకు చేసేస్తున్నారు.
ప్రతి విషయమూ.. పచ్చ మీడియాలో వచ్చేస్తోంది. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా చికాకు కలిగించే అంశం. ఒకసారి పచ్చమీడియాలో ‘ఇన్సైడ్’ వ్యవహారాలు రాగానే.. ఇక తెలుగుదేశం, దాని తోక పార్టీ జనసేన గానీ అందుకుంటాయి. రెచ్చిపోవడం మొదలవుతుంది.
కేబినెట్ లో గానీ, మంత్రులతో జరిగే అంతరంగిక సమావేశాల్లో గానీ మాట్లాడుకుంటున్న సంగతులు కొన్ని బయటకు లీక్ అవుతూ ఉండడం ఇవాళ్టి సమస్య కాదు. ఇదివరకు కూడా జరుగుతూనే ఉంది. అలాంటి వారిని పసిగట్టడం ప్రభుత్వాధినేతకు సులువైన వ్యవహారం కూడా. కానీ కట్టడి చేయడంపై దృష్టి సారించినట్టు లేదు.
ఇప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. నియోజకవర్గాల మార్పుచేర్పులు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మీద, జగన్ మీద అసంతృప్తితో రగిలిపోతున్నవారు, ఇన్నాళ్లుగా అండర్ గ్రౌండ్ లో ఉండిపోయిన మంత్రులు కూడా కేబినెట్ మీటింగుకు మాత్రం హాజరుగా తయారయ్యారు. వీరు అక్కడి చర్చల సారాంశాన్ని మాత్రమే కాదు, ఆంతరంగిక చర్చల మతలబుల్ని కూడా ప్రత్యర్థులకు మోయడానికే వచ్చి ఉంటారనే మాట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు కట్టడిచేసే చర్యలు మాటలు కూడా మరో వివాదానికి దారితీస్తాయనే ఉద్దేశంతోనే జగన్.. జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.