రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సరే.. ఆ రకంగా ఆయన కొత్త ఇమేజిని మూటగట్టుకున్నారు సరే. కానీ.. కొన్ని భిన్నమైన కోణాల్లో ఇటీవలి ఎన్నికలను పరిశీలించినప్పుడు ఆయన పరువు పోవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. పోయిన పరువును నిలబెట్టుకోవాలని.. రేవంత్ రెడ్డి తన శక్తియుక్తులు అన్నీ కేంద్రీకరిస్తున్నారు. మరోసారి పరాభవం ఎదురైతే.. రాగల విమర్శలు తన ఆధిపత్యానికి గండి కొడతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి గెలుపొందారు. అయితే ఆయనకు లభించింది కేవలం 10.919 ఓట్ల మెజారిటీ మాత్రమే. ఇన్నాళ్లూ ఎంపీగా ఉంటూ ఆయన ఢిల్లీ పెద్దల వద్ద తన ప్రాబల్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎంపీగా ఉండడం వల్ల కాంగ్రెసు అధిష్ఠానం వద్ద స్థానం సుస్థిరం చేసుకోవడం అనేది కాస్త సులువు అయింది. దాంతో ఆయన చాలా సునాయాసంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని ఆశించిన ఇతర నాయకులందరినీ పార్టీ అధినేతలే బుజ్జగించి మరీ ఆయనకు పదవి కట్టబెట్టారు.
అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెసు దారుణంగా ఓడిపోయింది. ఈ ఎంపీ సీటు పరిధిలో కాంగ్రెసు మీద భారాస ఏకంగా మూడున్నర లక్షల ఓట్ల ఆధిక్యం సాధించింది. రేవంత్ రెడ్డి పరువుపోయే ఫలితాలు అవి.
అందుకే రాజకీయంగా తన పరువు కాపాడుకునేలాగా.. తాను సిటింగ్ గా ప్రాతినిధ్యం వహించిన ఈ ఎంపీ సీటును మళ్లీ దక్కించుకోవాలని రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నట్టుతెలుస్తోంది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. ప్రధానంగా నగర ఓటర్లే అధికంగా ఉండే మల్కాజిగిరి పరిధిలో గత ఎన్నికల రేవంత్ మెజారిటీ కేవలం 11 వేలే. ఈసారి పరువు నిలబడాలంటే అంతకంటె ఎక్కువ మెజారిటీతో కాంగ్రెసు ను గెలిపించాలని అనుకుంటున్నారు. దీనికోసం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలనే వ్యూహంతో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెసుకు 9 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోనే ఆధిక్యం లభించింది. అయితే 14 సీట్లు గెలుస్తామనం అంటున్న కాంగ్రెసు నేతలు, కనీసం పదికి తక్కువ కాకుండా నెగ్గాలని ఆశపడుతున్నారు. మరి ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో చూడాలి.