ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో భారతీ జనతా పార్టీ నాయకులకు కూడా కొత్త ఆశలు పుడుతున్నాయి. చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లడానికి అనుకూలంగా పార్టీ అధిష్ఠానానికి తమ తమ నివేదికలు పంపిన పెద్దలు.. చాన్సు దొరికితే చట్టసభల్లోకి అడుగు పెట్టగలమనే ఆశలతో ఉన్నారు.
జగన్ మీద విరుచుకుపడుతూ.. చంద్రబాబు వైఫల్యాల మీద సుతిమెత్తని విమర్శలు చేస్తూ.. ఆయన పరోక్ష భజనలో తరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సారథి దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా విసురుతున్న సవాళ్లు విస్తుగొలుపుతున్నాయి.
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సహకరించడం లేదు అనే సంగతిని వైకాపా ప్రభుత్వం చెప్పగలదా అని పురందేశ్వరి సవాలు విసురుతున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా.. రాష్ట్ర పురోగతికి చికాకులు రాకుండా చూసుకోవాలనే జగన్ ఆలోచనను ఆమె మరో కోణంలోంచి ఆయనను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా ఇక్కడ చిన్నమ్మ ఒక విషయం గమనించాలి. ఏపీ పురోగతికి కేంద్రం సహకరిస్తున్నదో లేదో చెప్పడానికి జగన్ దాకా ఎందుకు ప్రజలందరికీ ఆ సంగతి తెలుసు కదా.. కనిపిస్తూనే ఉన్నది కదా.. అనేది ప్రజల మాటగా వినిపిస్తోంది.
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నిధులైనా పథకాలైనా వచ్చి ఉండచ్చు గాక.. కానీ.. కేంద్రం తరఫున అన్ని రాష్ట్రాలకు పథకాలను పంచేవిగా కాకుండా ఎక్స్ క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ కు ఏం చేశారు? ఏం ఇచ్చారు? ఏం ఒరగబెట్టారు? అనేది బిజెపి నాయకులు ఎవ్వరైనా చెప్పగలరా? అనేది ప్రజల ప్రశ్న.
పోలవరం ప్రాజెక్టు మీద ప్రజల ఆశలను నీరుగార్చడంలో బిజెపిదే విలన్ పాత్ర. నిర్మాణం సవ్యంగా జరగడానికి ఏనాడూ సజావుగా నిధులు ఇవ్వకుండా జాప్యానికి కారణమవుతున్నారు. పదేళ్లు గడచిపోతుండగా ప్రాజెక్టు అతీగతీ లేకుండా ఉండడానికి.. నిధులు విడదల చేసే కేంద్రానికి బాధ్యత లేదా అనేది జనంసందేహం.
ప్రత్యేకహోదా విషయంలో వంచించిన బిజెపి ప్రభుత్వం తరఫున పురందేశ్వరి వకాలత్తు పుచ్చుకుంటూ నానా మాటలు చెబుతున్నారు. హోదా వద్దని చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని, తర్వాత అది కూడా తీసుకోలేదని అంటున్నారు. అయితే జగన్ సర్కారు వచ్చిన తర్వాతనైనా అదే ప్యాకేజీని ఎందుకు ఇవ్వలేదో.. లేదా, చంద్రబాబు నిర్ణయం కాకుండా ప్రత్యేకహోదా విషయంలో ఆ ప్రభుత్వాన్ని ఎందుకు అభిప్రాయం అడగలేదో.. చిన్నమ్మ వద్ద వివరణ లేదు.
కనీసం రైల్వేజోన్ లాంటి చిన్న డిమాండ్ కూడా ఏపీకి తీర్చకుండా.. ఏ మొహం పెట్టుకుని ప్రజల ఎదుటకు ఎన్నికల అవసరానికి వెళ్లగలమని బిజెపి అనుకుంటున్నదో అర్థం కావడం లేదు.