మామయ్య పట్టుదలకు ఫలితం దక్కేనా?

ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో రాజకీయ ప్రతిష్టంభన ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న.. జగన్ వద్ద ఒకప్పట్లో తిరుగులేని ప్రాబల్యాన్ని కూడా వెలగబెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి…

ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో రాజకీయ ప్రతిష్టంభన ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న.. జగన్ వద్ద ఒకప్పట్లో తిరుగులేని ప్రాబల్యాన్ని కూడా వెలగబెట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుదలకు పోవడం వలన ఏర్పడిన ప్రతిష్టంభన అది. ప్రాక్టికల్ గా పార్టీ పరిస్థితులను పట్టించుకోకుండా, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా.. బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్న తీరు పార్టీకి నష్టం చేస్తుదా? ఆయనకే చేటు చేస్తుందా? అనేది అర్థం కావడం లేదు.

ఒక రకంగా చెప్పాలంటే.. విజయావకాశాలు లేవని సర్వేల్లో తేలుతున్న అబ్యర్థులను పక్కన పెట్టినప్పుడు.. వారు ఎన్నిరకాలుగా అలుగుతున్నప్పటికీ.. పార్టీనుంచి బయటకు వెళ్లడానికి సిద్ధపడుతున్నప్పటికీ.. జగన్ పట్టించుకోవడం లేదు. పార్టీ విజయం ఒక్కటే ప్రాధాన్యాంశంగా భావిస్తున్న ముఖ్యమంత్రి.. నాయకుల ముఖ ప్రీతి నిర్ణయాలు తీసుకోకూడదనే అభిప్రాయంతోనే ఉన్నారు. అలాంటిది, తనకు దగ్గరి చుట్టం కూడా అయినందున బాలినేని విషయంలో ఇప్పటికి కూడా చాలా మెతక ధోరణిని అవలంబిస్తున్నారని, చాలా మెట్లు దిగి మరీ ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఒంగోలు రాజకీయ పరిస్థితులను గురించి చర్చించడానికి, తుది నిర్ణయాలు తీసుకోవడానికి బాలినేనికి జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే.. ఆ అపాయింట్మెంట్ టైం దాటిపోయిన తర్వాత చాలా ఆలస్యంగా బాలినేని జగన్ నివాసం వద్దకు చేరుకున్నారు. అసలే ఎన్నికలకు సంబంధించిన కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్న సమయం.. అప్పటికే జగన్ వేరొకరితో వేరే సమావేశంలో ఉండడం వలన బాలినేని కలవలేదు. ఆయన అలిగి వెళ్లిపోయారు. ఇచ్చిన టైం పాటించకుండా ఆలస్యంగా వచ్చింది ఆయనే, తిరిగి అలకపూనింది కూడా ఆయనే. 

మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ మళ్లీ కేటాయించేది లేదని డిసైడ్ అయిపోయారు. ఆ విషయాన్ని ఇప్పటికే పలు విధాలుగా బాలినేనికి తెలియజేశారు కూడా. అయినా సరే.. బాలినేని అదొక్కటే పాయింట్ పట్టుకుని ఎందుకు అంతగా పట్టుపడుతున్నారో కూడా అర్థం కావడం లేదు.

మాగుంట విషయంలో జగన్ నిర్ణయం ఇంతగా అందరికీ తెలిసిపోయిన తర్వాత.. ఒకవేళ బాలినేని ఒత్తిడికి తలొగ్గి మాగుంటకు మళ్లీ టికెట్ ఇస్తే.. అది జగన్ అసమర్థత కింద నిరూపణ అవుతుంది కదా అనేది పలువురి వాదన. సాధ్యమయ్యే అవకాశమే లేని డిమాండుతో.. బాలినేని  శ్రీనివాసరెడ్డి వ్యవహారాన్ని తెగేదాకా లాగుతున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.