నాణేనికి రెండో వైపు చూద్దామా?

ఏ నాణేనికైనా రెండు ముఖాలు వుంటాయి. కానీ మన జనం ఎక్కువగా ఒక వైపే చూడ్డానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే మనది మాస్ హిస్టీరియా మెంటాలిటీ కాబట్టి. పోతే అంతా ఒకే దోవన పోవడం…

ఏ నాణేనికైనా రెండు ముఖాలు వుంటాయి. కానీ మన జనం ఎక్కువగా ఒక వైపే చూడ్డానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే మనది మాస్ హిస్టీరియా మెంటాలిటీ కాబట్టి. పోతే అంతా ఒకే దోవన పోవడం లేదంటే వదిలేయడం.

ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ ‘కుమారి ఆంటీ’. రోడ్ పక్కన భోజనాలు వండి విక్రయించే కుమారి ఆంటీ లాంటి వారు జంట నగరాల్లో ఎంతో మంది వున్నారు. కానీ కుమారి ఆంటీ ఎందుకు ఫేమస్ అంటే ఇన్ స్టా గ్రామ్.. యూ ట్యూబ్. ఇంకా.. ఇంకా.. బెంగుళూరు నుంచి, విశాఖ నుంచి టికెట్ లు పెట్టుకుని వచ్చి మరీ తినిపోవడం అంటే ఏమనాలి..’పిచ్చి అంటారండీ.. పిచ్చి’ అనే త్రివిక్రమ్ డైలాగు గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియా టైమ్ కనుక.. సరిపెట్టుకోవడమే.

కుమారి ఆంటీ రోడ్ సైడ్ మెస్ ను పోలీసులు ఆపేసారు. అదో అంతర్జాతీయ సమస్య. మీడియా విపరీతమైన అట్రాక్షన్ చూపించింది. తినే వాళ్లు పెరిగారు. వాళ్ల‌ను వీడియోలు తీసే వాళ్లు పెరిగారు. కీలకమైన ఆ ఏరియాలో ట్రాఫిక్ సమస్య వచ్చింది. అందువల్ల పోలీసులు ఈ చర్య తీసుకున్నారు ఇదీ సమాచారం.

అయితే ఇప్పుడు అది కాదు టాపిక్.

కేవలం మీడియానే లేదా సోషల్ మీడియానే ఆమె పొట్ట కొట్టింది అంటూ కొందరు. కాదు, జగన్ ఇల్లు ఇచ్చారు.. అంటూ వైకాపాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది అందుకే తీయించేసారు అంటూ మరి కొందరు. ఇదో వాదన.

అయితే ఇప్పుడు అది కూడా కాదు టాపిక్.

జంటనగరాల్లో దుకాణం పెట్టాలి అంటే లక్షలు, కోట్లు కావాలి. అడ్వాన్స్ లు, అద్దెలు, ఇతరత్రా ఖర్చులు. కానీ కీలకమైన ప్రదేశాల్లో పెద్దగా ఖర్చు లేకుండా దుకాణం పెట్టుకునే సులువైన ఉపాయం ఒకటి వుంది. అదేమిటి అంటే..

కాస్త రన్నింగ్ లో వున్న పాత మారుతి వాన్ లేదా మరో తరహా వాన్ ఒకటి కొనండి. దాన్నిండా అన్ని సామాన్లు పెట్టుకుని, మాంచి మెయిన్ రోడ్ పార్కింగ్ ప్లేస్ లో ఆపుకోండి. డోర్ తీసి, సరుకులు డిస్ ప్లే చేసుకుని అమ్మేసుకోండి. సింపుల్. పైసా అద్దె, అడ్వాన్స్ లేకుండా కూకట్ పల్లి మెయిన్ రోడ్ లాంటి రద్దీ ప్రదేశంలో మీకు దుకాణం వచ్చేసినట్లే. చట్టానికి.. న్యాయానికి మధ్య గీత మీద నిల్చున్నట్లు.. పార్కింగ్ ప్లేస్ లో వ్యాన్ ఆపడం నేరం కాదు. అందులో సరుకులు పెట్టుకోవడం అంతకన్నా నేరం కాదు. కానీ అక్కడ వ్యాపారం సాగించవచ్చా? అంటే అలాంటి రూలు ఏదీ మన ట్రాఫిక్ రూల్స్ లో వున్నట్లు ఐడియా లేదు. సరే, ఆ ఏరియా పోలీసుల దయ వుంటే సరి.

ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాల్లో ఈ విధంగా వ్యాపారాలు సాగించేవారు వేలల్లో వున్నారు. దుస్తులు.. డ్రయ్ ఫ్రూట్స్, హోమ్ ఫుడ్స్.. భోజనాలు.. టిఫిన్లు, పళ్లు..  ఇలా ఒకటేమిటి సమస్త వ్యాపారాలు పార్కింగ్ ప్లేస్ ల్లో సాగిపోతున్నాయి.

మరి పార్కింగ్ ప్లేస్ లను వీరు ఆక్యుపై చేస్తే, పార్కింగ్ అవసరం అయిన వాళ్ల సంగతి ఏమిటి? ఇది ఒక ప్రశ్న. పార్కింగ్ ప్లేస్ లో వీళ్లు వ్యాపారాలు చేయడం వల్ల, అక్కడకు వచ్చి కస్టమర్లు తమ వాహనాలను అక్కడే ఆపడం వల్ల వచ్చే ట్రాఫిక్ ఇబ్బందుల పరిస్థితి ఏమిటి?

ఇక ఈ రోడ్డు పక్క భోజనాల సంగతి చూద్దాం. ఫ్లయ్ ఓవర్ల కిందన, ఫుట్ పాత్ మీద, లేదా రోడ్డు పక్కన టేబుళ్లు వేసి, కుర్చీలు వేసి మరీ వ్యాపారాలు చేసేస్తున్నారు. ఈ సరుకులు, సరంజామా అంతా వ్యాన్ ల్లో తీసుకువస్తున్నారు. వ్యాన్ దూరంగా పెట్టి, దుకాణం మొదలుపెడుతున్నారు. ఇక్కడ వచ్చే ఆటో డ్రైవర్లు తమ ఆటోలను, స్టూడెంట్లు తమ బైకులను అక్కడే ఆపుతున్నారు. దీని వల్ల ఎంత ట్రాఫిక్ ఇబ్బంది వస్తోందో అన్నది ఆ ఏరియాల్లో వుండేవారికే తెలుస్తుంది.

కానీ పోలీసులు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో తెలియదు. కూకట్ పల్లిలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి రోడ్ పక్క భోజనాల వల్ల ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో, ఈ. సోకాల్డ్ సోషల్ మీడియా జనాలు, షార్ట్ వీడియో చేసే జనాలు ఓ వీడియో సర్వే చేస్తే బాగుండును. అప్పుడు పోలీసులు ఇవన్నీ లేపేస్తారు. ఏదో పేదవారు పాపం, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ వుంటే పొట్ట కొడతారా? అని మళ్లీ వాదన మొదలవుతుంది.

నెలకు 15 లక్షల టర్నోవర్ వ్యాపారం చేసే వారు పేదవారు ఎలా అవుతారు?  నెలకు మూడు లక్షల లాభం చేసుకునేవారు పేదవారు ఎలా అవుతారు? అన్న లాజిక్ ఎవరూ అడగకూడదు.

ఇటు వీళ్లూ బాగుండాలి. ట్రాఫిక్ సమస్యలూ రాకూడదు అంటే ప్రతి ఏరియాలో కామన్ గ్రౌండ్‌లను ప్రభుత్వం ఎంపిక చేయాలి. ఈ విధంగా వాన్ లు కొనేసి, ఖర్చు లేని వ్యాపారం చేసే వారికి అక్కడ ప్లేస్ లు ఇవ్వాలి. అంతే తప్ప, వేడి పుట్టింది అని ఒకరిని ఖాళీ చేయించి, ఒకరిని వదిలేయడం కాదు.

సోషల్ మీడియా జనాలు ముందుగా ప్రతి ఏరియాలో ట్రాఫిక్ కు విపరీతమైన సమస్యగా మారుతున్న ఈ రోడ్ సైడ్ వ్యాపారాల మీద షార్ట్ వీడియోలు చేయాలి. నెగిటివ్‌గా చేయనక్కరలేదు. కుమారి ఆంటీ బిజినెస్ పెంచినట్లే పెంచేయండి. జనాలు పెరిగిపోతారు. పోలీసులు అక్కడ తప్పిస్తారు. ట్రాఫిక్ సమస్య తీరిపోతుంది.

ఇదీ నాణేనికి రెండో వైపు. కానీ ఈ వైపు చూడడానికి మనం అంతగా ఇష్టపడం. ఎందుకంటే మనది మాబ్ మెంటాలిటీ. అందరూ ఏ దోవన పోతే అటే పోవడమే.