ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా స్థానికేతరుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డినే బరిలో దింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు కారణాల రీత్యా సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని సీఎం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. ఎలాగైనా మాగుంటకే టికెట్ ఇప్పించుకునేందుకు ఒంగోలు ఎమ్మెల్యే, సీఎం సమీప బంధువు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
బాలినేని ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. బాలినేని ఆశీస్సులను చెవిరెడ్డి కోరినట్టు తెలిసింది. సీఎం జగనే టికెట్ ఇస్తున్నప్పుడు, తనదేముందని చెవిరెడ్డితో బాలినేని అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం వద్ద చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకించినట్టు సమాచారం. స్థానికులనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించేందుకు పలువురు నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి.
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడిని ఒంగోలు ఎంపీ పోటీ చేయించేందుకు పరిశీలించారు. అందుకు శిద్ధా కుటుంబం అంగీకరించలేదు. ఒక దశలో మాగుంటను కాకుండా మీ ఇష్టం వచ్చిన వ్యక్తిని నిలుపుకోవాలని బాలినేనికి జగన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. బాలినేని అందుకు అంగీకరించలేదు.
చివరికి తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఒంగోలు లోక్‌సభ స్థానం మొదటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి నమ్మకమైన నియోజకవర్గమైంది. ఆ భరోసాతోనే చెవిరెడ్డి కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.