ఎఎంబి సక్సెస్ ఫిక్స్ – సుహాస్

“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో  హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి రెండున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో…

“కలర్ ఫొటో”, “రైటర్ పద్మభూషణ్” సినిమాలతో  హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫిబ్రవరి రెండున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు సుహాస్.

గత ఏడాది ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంబాజీపేట మర్యేజ్ బ్యాండ్. పక్కా విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నాను. ఈ మధ్యే బాబు పుట్టాడు. అన్నీ శుభ శకునాలే. ఈ సినిమా కోసం బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా.

అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. దర్శకుడు దుశ్యంత్ రాసిన కథ నన్ను కదిలించింది. మా టీమ్ అంతా స్క్రిప్ట్ మీద నమ్మకంతో వర్క్ చేశాం. ఈ కథలో జరిగిన ఇన్సిడెంట్స్ నేను రియల్ లైఫ్ లో చూడలేదు గానీ మా డైరెక్టర్ చూసిన సంఘటనలు కథలో సగం వరకు ఉంటాయి. తను చూసినవి, తనకు లైఫ్ లో జరిగిన కొన్ని సందర్భాల స్ఫూర్తి ఈ కథలో ఉంది. మిగతాది సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేశాడు.

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” 2007 లో జరిగే కథ. ఈ సినిమా కథ ఇంటర్వెల్ ఇరవై నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడి నుంచి ఒక హైలోకి వెళ్తుంది. ఇంటర్వెల్ వరకు చూశాక సినిమా బాగా చేశారని కచ్చితంగా అంటారు. మిగిలిన మూవీ ఎమోషనల్ గా ఫీల్ తో సాగుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు సరదాగా సాగుతుంటాయి. కానీ ఈ సినిమాలో హై ఎమోషన్ ఉంటుంది.

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు సృష్టిస్తుంది అనేది మెయిన్ పాయింట్. నేను, శరణ్య కవల పిల్లలం. మా పుట్టినరోజున జరిగిన సంఘటనలు జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయి అనేది ఈ మూవీలో కీలకంగా ఉండే అంశం.

హీరోయిన్ శివానికి ఈ సినిమా తర్వాత మంచి పేరొస్తుంది. ఆమె పెర్ ఫార్మెన్స్ అంత బాగా వుంటుంది. శివాని డ్యాన్సర్, సింగర్ కూడా. అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య గారు, విలన్ గా చేసిన నితిన్ కూడా ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నితిన్ మలయాళీ, తెలుగు నేర్చుకుని, అమలాపురం వచ్చి అక్కడ యాస కూడా నేర్చుకున్నాడు. ఆయన మలయాళీ అంటే చూసేవాళ్లు నమ్మలేకపోయారు.

నాలాంటి హీరోలకు ప్రీమియర్స్ కు వచ్చే రెస్పాన్స్ చాలా ముఖ్యం. నా దగ్గరకు వచ్చిన వాటిలో నేను నాకు నప్పే కథలు సెలెక్ట్ చేసుకుంటున్నా. హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. హిట్ 2లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా.

కలర్ ఫొటో సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ చెప్పాడు. నెక్ట్ లెవెల్ లో ఉంది. ఆ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సుకుమార్ అసోసియేట్ తో ప్రసన్నవదనం అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. కేబుల్ రెడ్డి అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ జరుగుతోంది.