ఓర్చినమ్మకు తేట నీరు అన్నది పాతకాలెం సామెత. ఇప్పటి జనాలకు అర్థం కాకపోవచ్చు. అది వేరే సంగతి. నిర్మాత దానయ్య అచ్చంగా ఇదే టైపు. సరైన అప్ కమింగ్ దర్శకుడినో, లేదా సరైన హీరోనో చూసి అడ్వాన్స్ ఇచ్చి రుమాలు వేస్తారు.
కొత్త దర్ళకుడు ఎవరైనా ప్రామిసింగ్ గా వున్నారని తెలిస్తే చాలు డివివి సంస్థ నుంచి అడ్వాన్స్ వెళ్లిపోతుంది. వాళ్లు ఎప్పుడు చేస్తే అప్పుడే.. అంతవరకు అలా ఓపిక పట్టి వుంటారు. చేయడం కుదరకపోతే వడ్డీతో సహా ముక్కుపిండి అడ్వాన్స్ వసూలు చేస్తారు. అది మళ్లీ వేరే సంగతి. అస్సలు ముందుగా అడ్వాన్స్ లు అందుకోని రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వాళ్లు సైతం డివివి దానయ్య అడ్వాన్స్ అందుకున్నవారే. అందువల్లే ఆర్ఆర్ఆర్ సినిమా డివివి బ్యానర్ లో సాధ్యమైంది.
పవన్ కళ్యాణ్-సుజిత్ సినిమా, వివేక్ ఆత్రేయ-నాని కాంబినేషన్ సినిమా, నాని-సుజిత్ సినిమా ఇలా క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్న ఈ బ్యానర్ మరో మాంచి కాంబినేషన్ సినిమా ను త్వరలో ప్రకటించబోతోంది.
తమిళ హీరో విజయ్ తో సినిమా టేకప్ చేస్తూ తమిళ నాట కూడా అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు విజయ్. దాని తరువాత సినిమా డివివి బ్యానర్ లో వుంటుంది.
అయితే డైరెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచారు. మొత్తం మీద మరో పన్నెండు నెలల కాలంలో నాలుగైదు క్రేజీ సినిమాలు విడుదల చేసేందుకు డివివి బ్యానర్ రంగం సిద్దం చేసుకుంటోంది.