అక్క‌డి టీడీపీలో అన్న‌ద‌మ్ముల గొడ‌వ‌!

విజ‌య‌వాడ‌లో కేశినేని బ్ర‌ద‌ర్స్ గొడ‌వ మ‌రిచిపోక‌నే, టీడీపీలో మ‌రో అన్న‌ద‌మ్ముల ర‌గ‌డ తెర‌పైకి వ‌చ్చింది. ఈ ప‌రిణామంపై టీడీపీ క‌ల‌వ‌రం చెందుతోంది. ఈ ద‌ఫా దామ‌చ‌ర్ల బ్ర‌ద‌ర్స్ ప‌ర‌స్ప‌రం క‌త్తులు దూసుకోవ‌డం ప్ర‌కాశం జిల్లాలో…

విజ‌య‌వాడ‌లో కేశినేని బ్ర‌ద‌ర్స్ గొడ‌వ మ‌రిచిపోక‌నే, టీడీపీలో మ‌రో అన్న‌ద‌మ్ముల ర‌గ‌డ తెర‌పైకి వ‌చ్చింది. ఈ ప‌రిణామంపై టీడీపీ క‌ల‌వ‌రం చెందుతోంది. ఈ ద‌ఫా దామ‌చ‌ర్ల బ్ర‌ద‌ర్స్ ప‌ర‌స్ప‌రం క‌త్తులు దూసుకోవ‌డం ప్ర‌కాశం జిల్లాలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒంగోలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌నార్ద‌న్‌, ఆయ‌న త‌మ్ముడు స‌త్య మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి.

విజ‌య‌వాడ‌లో కేశినేని బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య గొడ‌వ చినికిచినికి గాల‌వానై… చివ‌రికి ఎంపీ కేశినేని నాని పార్టీ వీడేట్టు చేసింది. విజ‌య‌వాడ లోక్‌స‌భ ప‌రిధిలో బ‌ల‌మైన ప‌ట్టున్న కేశినేని రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న్ను విజ‌య‌వాడ ఎంపీ అభ్యర్థిగా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. టీడీపీ నుంచి ఆయ‌న త‌మ్ముడు కేశినేని చిన్ని బ‌రిలో దిగ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో దామ‌చ‌ర్ల బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య విభేదాలు టీడీపీలో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తాయో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒంగోలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న జ‌నార్ద‌న్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ ద‌ఫా టికెట్ ఇవ్వొద్ద‌ని ఆయ‌న త‌మ్ముడు స‌త్య అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నార‌ని తెలిసింది. జ‌నార్ద‌న్‌, స‌త్య మ‌ధ్య ఆస్తి, రాజ‌కీయ త‌గాదాలున్నాయి. దీంతో ప‌ర‌స్ప‌రం న‌ష్టం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో దామ‌చ‌ర్ల స‌త్య‌దే పెత్త‌నం. పేరుకే టీడీపీ ఎమ్మెల్యే వీరాంజ‌నేయ‌స్వామి. అన‌ధికార ఎమ్మెల్యేగా స‌త్య అధికారం చెలాయిస్తున్నారు. ఒంగోలులో కూడా స‌త్య అధికారాన్ని చెలాయించ‌డానికి పావులు క‌ద‌ప‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ గ్రూప్‌లో స‌త్య ఉన్నారు. చంద్ర‌బాబు మ‌నిషిగా దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ గుర్తింపు పొందారు. ఇప్పుడంతా లోకేశ్ హ‌వా కొన‌సాగుతుండ‌డంతో ఆయ‌న వ‌ర్గీయులు త‌మ‌కు గిట్ట‌ని నేత‌ల‌కు చెక్ పెడుతున్నార‌నే మాట వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేశినేని నానిని కూడా బ‌య‌టికి పంపార‌ని చెబుతారు.

విజ‌య‌వాడ‌లో మాదిరిగానే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌కు చెక్ పెట్టేందుకు ఒంగోలు సీటును పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు ఇవ్వాల‌ని స‌త్య ప్ర‌తిపాద‌న చేస్తున్నార‌ని తెలిసింది. దీంతో ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు జ‌న‌సేన‌కు సీటు, అలాగే అన్న‌కు చెక్ పెట్టిన‌ట్టు అవుతుంద‌నేది దామ‌చ‌ర్ల స‌త్య వ్యూహం. నిజానికి ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ద‌ర్శి, గిద్ద‌లూరు సీట్ల‌ను జ‌న‌సేన అడుగుతోంది. ఇప్పుడు అన్న‌కు చెక్ పెట్టేందుకే ఒంగోలును స‌త్య తెర‌పైకి తెచ్చార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.