ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా టికెట్ ఇవ్వొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకోడానికి కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీని వెనుక ఢిల్లీ ఎఫెక్ట్ బలంగా పని చేసిందనే చర్చ వైసీపీలో సాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి కూడా ఉన్నారు. ఈయన జైల్లో ఉండొచ్చారు.
ఇదే కేసులో వైసీపీకి సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్‌చంద్రారెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన కూడా చాలా కాలం జైల్లో గడిపి బెయిల్‌పై బయటికొచ్చారు. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తదితర ప్రముఖులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కవిత పలుమార్లు ఈడీ దర్యాప్తునకు వెళ్లి వచ్చారు. ఇటీవల కూడా కవితకు ఈడీ నోటీసులు పంపగా, ఆమె కోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అనేక దఫాలు ఈడీ నోటీసులు పంపి, విచారణకు రావాలని కోరింది. అయినప్పటికీ ఆయన ఖాతరు చేయకపోవడం గమనార్హం. అయితే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వాంగ్మూలం ఇవ్వాలని మాగుంట , ఆయన తనయుడు రాఘవరెడ్డిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఒత్తిడి చేసినట్టు తెలిసింది. సీఎం జగన్ ద్వారా ఆయన పార్టీకి చెందిన ఎంపీ మాగుంటపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.
దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద జగన్ అవమానంగా భావించినట్టు తెలుస్తోంది. పైగా టీడీపీతోనూ ఆయన రాజకీయ వైరాన్ని కొనసాగించకపోవడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ విషయంలో ఆశించిన స్థాయిలో మాగుంట విధేయతగా వుండడం లేదనే సాకుతో మాగుంటకు టికెట్ నిరాకరించడానికి జగన్ నిర్ణయించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.