షర్మిల టార్గెట్ పులివెందుల ఎమ్మెల్యేనేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథిగా చెలరేగిపోతున్న వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేందుకు ఆమె నానా పాట్లు పడుతున్నారు. ప్రత్యక్షంగానే తెలుగుదేశానికి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథిగా చెలరేగిపోతున్న వైఎస్ షర్మిల తన రాజకీయ భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేందుకు ఆమె నానా పాట్లు పడుతున్నారు. ప్రత్యక్షంగానే తెలుగుదేశానికి మేలు చేయడానికి ఉబలాటపడుతున్నారు.

జగన్ మీద ఎన్ని నిందలు వేసినా సరే.. తద్వారా వైఎస్ఆర్ అభిమానుల ఓట్లను చీల్చినా సరే.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎన్ని సీట్లలో డిపాజిట్లు సాధించగలరు అనేది మాత్రమే ప్రధమ ప్రాధాన్యంగా కనిపిస్తున్న ఈ తరుణంలో.. ఆమె భవిష్యత్తు సంగతి ఏమిటి? అనే ప్రశ్న ఎవ్వరికైనా కలుగుతుంది.

తెలంగాణలో చేసిన త్యాగాలతో పాటు, ఏపీలో కాంగ్రెసు పార్టీ సారథిగా కష్టపడుతూ.. ఆ పార్టీ ఓటు బ్యాంకును కాస్త పెంచడానికి ఆమె ఉపయోగపడితే చాలునని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినా సరే.. రాజ్యసభ ఎంపీగా చేయాలనే ముందస్తు ఒప్పందంతోనే షర్మిల పగ్గాలు స్వీకరించినట్టుగా కూడా పుకార్లున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఎలాంటి త్యాగం చేయడం ద్వారా.. తన రాజ్యసభ స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.. అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం, పత్రికల్లో వార్తలు, పరిణామాలను బట్టి.. షర్మిల పులివెందుల ఎమ్మెల్యే సీటునుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టుగా, అన్న జగన్మోహన్ రెడ్డి మీద బరిలో తలపడడానికి డిసైడ్ అయినట్టుగా అనిపిస్తోంది.

కడప జిల్లాలో ప్రస్తుతం షర్మిల పర్యటిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో ఈ సందర్భంగా ఆమె భేటీ అయ్యారు. వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉన్నదనే ఆమె ఆరోపణలకు షర్మిల కూడా ఇదివరకటి నుంచి కూడా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలిసి పని చేద్దామని, కాంగ్రెసు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని సునీతను షర్మిల అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.

పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ రెండు స్థానాల్లో ఏదో ఒకదానిని సునీతను ఎంచుకోమని షర్మిల కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ తరఫున వైఎస్ కుటుంబ సభ్యులే పోటీచేయాలని కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యేకించి.. వివేకా హత్య కేసులో సునీతమ్మ ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్న అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా సునీతమ్మనే గానీ, లేదా ఆమె తల్లి, వివేకా భార్య సౌభాగ్యమ్మను గానీ పోటీచేయించాలని షర్మిల ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అవినాష్ రెడ్డి వివేకాను చంపించేశాడు.. అని ఆరోపించేవాళ్లనే ఆయన మీద మోహరించాలనేది షర్మిల వ్యూహం. ఈ లెక్కన పులివెందులలో కూడా తమ కుటుంబమే పోటీచేయాలని అనుకుంటే.. ఆమె స్వయంగా రంగంలోకి దిగుతారు. రెండుసీట్లలో ఏదైనా సరే ప్రధాన లక్ష్యం గెలుపు కాదు గనుక.. పులివెందుల ఎమ్మెల్యేగా షర్మిల పోటీచేసి, జగన్ మీద మరింతగా బురద చల్లడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.