షారూక్ సృష్టించిన జవాన్, పఠాన్ రికార్డుల్ని తిరగరాస్తుందని భావించారు. కనీసం గదర్-2 రికార్డులైనా చెల్లాచెదురవుతాయని అనుకున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఫైటర్ సినిమా మొదటి సోమవారానికే తేలిపోయింది.
హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ వార్ యాక్షన్ డ్రామా.. రిపబ్లిక్ డే సీజన్ ను బాగానే క్యాష్ చేసుకుంది. దీంతో సినిమా సూపర్ సక్సెస్ అని అంతా భావించారు. కానీ ఈ సినిమా అసలు రంగు నిన్నటితో బయటపడింది.
తొలి సోమవారం ఫైటర్ సినిమా పూర్తిస్థాయిలో చతికిలపడింది. ఎంతలా అంటే, మొదటి రోజుతో పోలిస్తే, ఈ సినిమా ఏకంగా 70 శాతం డ్రాప్ అయింది. ఇంతకుముందు ఆదిపురుష్ (78.61 శాతం), షంషేరా (72.68 శాతం), బచ్చన్ పాండే (74.57 శాతం) సినిమాల విషయంలో ఇదే జరిగింది.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి కీలకమైన సర్క్యూట్స్ లో ఫైటర్ సినిమా సోమవారం దారుణంగా పడిపోయింది. ఫలితంగా ఇండియాలో ఈ సినిమాకు సోమవారం కేవలం 8 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇండియాలో నిన్న ఈ సినిమా ఆక్యుపెన్సీ 11 శాతం మాత్రమే.
ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 126 కోట్ల రూపాయల నెట్ సాధించిన ఈ సినిమా, ఇకపై రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోవడం కష్టమని ట్రేడ్ తేల్చేసింది.