పవన్ కల్యాణ్ సినిమాకు నాలుగేళ్లు.. కానీ..!

పదేళ్లు పూర్తయిన సందర్భంగా రీ-రిలీజ్ లు, ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో సంబరాలు లాంటివి ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా కూడా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కాకపోతే తేడా…

పదేళ్లు పూర్తయిన సందర్భంగా రీ-రిలీజ్ లు, ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో సంబరాలు లాంటివి ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమా కూడా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కాకపోతే తేడా ఏంటంటే.. ఆ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. సూటిగా చెప్పాలంటే నాలుగేళ్లయినా సినిమా షూటింగ్ కూడా పూర్తికాలేదు.

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే టైమ్ లో క్రిష్ దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేశాడు పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. అప్పట్లో దాన్ని పవన్ 27వ చిత్రంగా వ్యవహరించారు. అదే టైమ్ లో తన 26వ చిత్రం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు పవన్.

కట్ చేస్తే, నాలుగేళ్లు గడిచిపోయాయి. వకీల్ సాబ్ రిలీజైంది. ఆ తర్వాత భీమ్లానాయక్, బ్రో సినిమాలు కూడా వచ్చాయి. 27వ సినిమాగా చెప్పుకున్న హరిహర వీరమల్లు మాత్రం ఇంకా సెట్స్ పైనే ఉంది. అప్పట్నుంచి ఇప్పటివరకు క్రిష్ ఈ సినిమాపైనే ఉన్నాడు.

బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఈ సినిమాపై అనుమానానాలే ఉన్నాయి. ఒకవేళ పవన్ మళ్లీ సెట్స్ పైకి వస్తే ఓజీ సినిమాకు కాల్షీట్లు ఇస్తాడనే ప్రచారం నడుస్తోంది తప్ప, హరిహర వీరమల్లు సినిమా ప్రస్తావన మాత్రం ఎక్కడా రావడం లేదు. 

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అవుతుందని తెలిసి, వెంటనే మరో సినిమాకు షిఫ్ట్ అయ్యడు హరీశ్ శంకర్. క్రిష్ కూడా అలానే చేసి ఉంటే, ఈ గ్యాప్ లో కనీసం 2 సినిమాలు రిలీజ్ చేసి ఉండేవాడు.